సోనూసూద్‌ రూ.20 కోట్ల పన్ను ఎగవేశారు!

ప్రధానాంశాలు

సోనూసూద్‌ రూ.20 కోట్ల పన్ను ఎగవేశారు!

విదేశీ విరాళాల చట్టాన్నీ ఉల్లంఘించారు

ఆదాయపు పన్ను శాఖ ఆరోపణలు

దిల్లీ: సినీ నటుడు సోనూసూద్‌, ఆయన భాగస్వాములు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడ్డారని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ) ఆరోపించింది. లెక్కల్లో చూపించకుండా దాచిన ఆదాయాన్ని.. బోగస్‌ సంస్థల నుంచి రుణాలు పొందినట్లుగా పద్దు పుస్తకాల్లో పొందుపరిచి ఆ మొత్తాలను ఆస్తుల కొనుగోలు, ఇతరత్రా పెట్టుబడులకు మళ్లించారని పేర్కొంది. కరోనా సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు చేపట్టిన దాతృత్వపు కార్యక్రమాల కోసం ఇతర దేశాల్లోని వారి నుంచి నిధులు సేకరించే క్రమంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలనూ ఉల్లంఘించారని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15న సోనూసూద్‌ నివాసాలు, లఖ్‌నవూకు చెందిన ఓ పారిశ్రామిక గ్రూప్‌ సంస్థలపై ప్రారంభించిన సోదాలు, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీడీటీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ముంబయి, లఖ్‌నవూ, కాన్పుర్‌, జైపుర్‌, దిల్లీ, గురుగామ్‌లలోని 28 ప్రాంగణాల్లో సోదాలు జరిపామని, సోనూసూద్‌, ఆయన భాగస్వాములు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనడానికి తగిన ఆధారాలు లభ్యమయ్యాయని వెల్లడించింది.

ఐటీ శాఖ ఆరోపణలివి..

* సోనూసూద్‌ తన వృత్తి ద్వారా ఆర్జించిన సొమ్మును లెక్కల్లో చూపకుండా దాచిపెట్టి..దాదాపు 20 బోగస్‌ సంస్థల నుంచి రుణాలు పొందినట్లుగా ఖాతా పుస్తకాల్లో చూపారు. తద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు.

* రుణాల ద్వారా సేకరించినట్లు చూపిన మొత్తాలను ఆస్తుల కొనుగోలుకు, పెట్టుబడులకు ఉపయోగించారు.

* 2020 జులై 21న సోనూసూద్‌ ప్రారంభించిన దాతృత్వపు సంస్థ ద్వారా ఇప్పటి వరకు రూ.18.94 కోట్లు సేకరించారు.

* ఈ మొత్తం నుంచి వివిధ సహాయక చర్యల కోసం రూ.1.9కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన మరో రూ.17 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు గుర్తించాం. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా మరో రూ.2.1కోట్లను కూడా విదేశీ దాతల నుంచి సేకరించారు.

* మౌలిక వసతులను అభివృద్ధిచేసే లఖ్‌నవూకు చెందిన ఓ పారిశ్రామిక సంస్థతో కలిసి సోనూసూద్‌ సంయుక్తంగా పెట్టుబడులు పెట్టారు.

* ఈ పారిశ్రామిక సంస్థ కార్యకలాపాల్లో పలు అవకతవకలు గమనించాం.  రూ.65కోట్ల విలువైన బోగస్‌ కాంట్రాక్టులు సృష్టించినట్లు తెలుస్తోంది.

* ఇన్‌ఫ్రా సంస్థ.. జైపుర్‌కు చెందిన మరో కంపెనీ మధ్య రూ.175 కోట్ల మేర అనుమానాస్పదమైన లావాదేవీలను గుర్తించాం.

* శనివారం వరకు జరిగిన సోదాల్లో రూ.1.8 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 11 లాకర్లను నిషేధ ఉత్తర్వుల పరిధిలోకి తీసుకొచ్చామని సీబీడీటీ వివరించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని