వైకాపా ఎమ్మెల్యే కాకాణిపై కేసు ఎత్తివేయలేం

ప్రధానాంశాలు

వైకాపా ఎమ్మెల్యే కాకాణిపై కేసు ఎత్తివేయలేం

ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి (వైకాపా)పై కేసు ఎత్తివేతకు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఆగస్టు 10 ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో కేసు ఎత్తివేతకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డిపై కేసు ఉపసంహరణకు అనుమతించాలంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ దాన్ని తిప్పి పంపింది. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నెల్లూరు గ్రామీణ పోలీసులు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై గతంలో కేసు నమోదు చేశారు. విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ కేసు ఎత్తివేతకు 2020 జూన్‌లో జీవో 560 జారీ చేసింది. ఆ జీవో ఆధారంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు ఉపసంహరణకు అనుమతివ్వాలని ప్రత్యేక కోర్టులో ప్రాసిక్యూషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా కేసుల ఉపసంహరణకు అనుమతి ఉండదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినందున ప్రాసిక్యూషన్‌ పిటిషన్‌ను తిప్పి పంపుతున్నట్లు (రిటన్‌ చేస్తున్నట్లు) న్యాయాధికారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని