అందుబాటులోకి సరికొత్త ఎండోస్కోపీ!

ప్రధానాంశాలు

అందుబాటులోకి సరికొత్త ఎండోస్కోపీ!

ఇలా వాడి అలా పారేయొచ్చు..
ఇన్‌ఫెక్షన్ల నుంచి పూర్తి రక్షణ
ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వాడి పారేసే (డిస్పోజబుల్‌) ఎండోస్కోపీ మనకూ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో తొలిసారి దీనిని ఉపయోగించి పైత్యరస నాళంలో రాళ్లతో బాధపడుతున్న 93 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా రాళ్లను తొలగించారు. ఏఐజీ ఛైర్మన్‌, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘సాధారణంగా అన్నవాహిక, పెద్దపేగు, గొంతు, మూత్రమార్గం, ఉదరం, పిత్తాశయం తదితర శరీర భాగాల్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఎండోస్కోపీ ద్వారా పరీక్షిస్తుంటారు. ఇప్పటివరకు నాన్‌ డిస్పోజబుల్‌ ఎండోస్కోపీనే వినియోగిస్తున్నారు. దీని ఖరీదు రూ.30-40 లక్షల వరకు ఉంటుంది. ఒకరికి వాడిన తర్వాత స్టెరిలైజ్‌ చేసి ఇతరులకు వినియోగిస్తుంటారు. ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు రోగి శరీరంలోని మొండి బ్యాక్టీరియా దీనిద్వారా ఇతరులకూ వ్యాప్తించే ముప్పు ఉండేది. ప్రత్యామ్నాయం లేకపోవడంతో నాన్‌ డిస్పోజబుల్‌ ఎండోస్కోపీనే వినియోగిస్తున్నారు. ఇకపై ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయని’’ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. డిస్పోజబుల్‌ ఎండోస్కోపీ తొలుత 2020లో యూఎస్‌లో అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఆసియాలో తొలిసారి హైదరాబాద్‌లో దీనిని వినియోగించామని వివరించారు. మీడియా సమావేశంలో డాక్టర్‌ మెహన్‌ రాంచందాని పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని