అధ్యయనం చేస్తాం.. నిధులివ్వం.. బాగు చెయ్యం

ప్రధానాంశాలు

అధ్యయనం చేస్తాం.. నిధులివ్వం.. బాగు చెయ్యం

చెరువుల సమస్యపై కదలని యంత్రాంగం
శాశ్వత మరమ్మతులకు నిధుల కొరత

ఈనాడు హైదరాబాద్‌: వానొచ్చినప్పుడే గొడుగు కోసం వెతికినట్లు.. వరదలొచ్చినప్పుడే చెరువుల ఆక్రమణల గురించి ఆరాతీయడం.. ఆ తర్వాత మరచిపోవడం. కొన్నేళ్లుగా హైదరాబాద్‌ నగరంలోని పరిస్థితి ఇది. రాజధాని నగరం, పరిసర జిల్లాల్లో కొన్ని వందల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. అనేక చెరువులకు గట్లు బలహీనపడ్డాయి. తూములు, అలుగులు లేకుండాపోయాయి. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేయడంతో పాటు, శాశ్వత పనులు చేయాల్సి ఉందని నీటిపారుదల శాఖ నియమించిన ఇంజినీర్ల బృందాలు నివేదించాయి. కానీ ఇప్పటివరకు ఆ దిశలో ముందడుగు పడలేదు. చెరువులకు శాశ్వత మరమ్మతులు చేయడానికి రూ. 32 కోట్లు అవసరమని నీటిపారుదల శాఖ తేల్చినా, నిధులు అందకపోవడంతో పనులు జరగలేదు. సమస్య ఎదురైనప్పుడు కనిపించిన హడావుడి, వేగం దానిని పరిష్కరించడంలో కనిపించడం లేదు. చెరువుల ఆక్రమణలు తొలగించడం, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడం తదితర అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీలు ఇచ్చే నివేదికలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. భారీ వర్షాలు వచ్చి కాలనీలు నీట మునిగినప్పుడు ఆక్రమణల గురించి, దెబ్బతిన్న చెరువుల గురించి మాట్లాడే నేతలు, అధికారులు తర్వాత వాటిపై దృష్టి పెట్టడంలేదు.

భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతమైనప్పుడల్లా ఏదో ఒక నిపుణుల కమిటీ వేయడం, అవి అధ్యయనం చేసి సిఫార్సులు చేయడంతోనే సరిపోతుంది. గత ఏడాది అక్టోబరులో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా 25 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 475 శాతం ఎక్కువగా రావడంతో చెరువులు తెగి, చెరువుల్లోకి నీళ్లు వెళ్లే మార్గాలు ఆక్రమణలకు గురికావడంతో వరదనీరు కాలనీల్లోకి ప్రవేశించి తీవ్ర నష్టం జరిగింది. ఈ సమయంలో నీటిపారుదల శాఖ 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృందానికి ఒక సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ నేతృత్వం వహించారు. ఒక్కో బృందం 10 నుంచి 15 చెరువుల చొప్పున మొత్తం 192 చెరువులు, కుంటలను పరిశీలించారు. వాటిలో సగానికిపైగా ఆక్రమణలకు గురయ్యాయని, రెండు చెరువులు అసలు కనిపించలేదని నివేదించారు. ఆరు చెరువులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 16 చెరువులకు గండ్లు పడ్డాయని గుర్తించారు. 27 చెరువులకు తూములు దెబ్బతింటే, 32 చోట్ల కట్టలు, 31 చోట్ల తూములు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల చెరువులోకి నీళ్లొచ్చే మార్గాలు ఆక్రమణకు గురికాగా, దిగువన కాలువలను ఆక్రమించుకున్న వారు తూములు, అలుగులు ధ్వంసం చేసి వాటిని పూర్తిగా మూసేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఫోటోలతో సహా వివరాలు సమర్పించారు. తాత్కాలిక మరమ్మతులకు రూ. 9.84 కోట్లు అవసరమని, ఆక్రమణలు తొలగించడంతోపాటు శాశ్వత పనులు చేపట్టడానికి రూ. 31.64 కోట్లు కావాలని అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతులైతే కొంతవరకు జరిగాయి కానీ, శాశ్వత మరమ్మతులకు నిధులు విడుదల కాలేదు. పనులూ జరగలేదు. మళ్లీ భారీ వర్షాలు వస్తే అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది. దీనిపై నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరగా, నిధులు విడుదల కాకపోవడంతో శాశ్వత పనులు చేపట్టలేదని తెలిపారు.


హుస్సేన్‌సాగర్‌ సంగతీ అంతే

హుస్సేన్‌సాగర్‌ నుంచి నీటి విడుదల సామర్థ్యం తగినంతగా లేకపోవడంతో బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల ముంపు సమస్య ఏర్పడుతుందని, దీనిని నివారించడానికి గేట్లతో కూడిన స్పిల్‌వే ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ గేట్లతో కూడిన స్పిల్‌వేను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నిగేట్లతో నిర్మించాలని, ఎంత వ్యయమవుతుంది వంటి అంశాలతో నివేదించినా ఇప్పటివరకు దీనిపై కూడా ముందడుగు పడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని