
ఫీచర్ పేజీలు
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏంటీ అలా చూస్తున్నారు. ఈ నత్త ఏంటి ఇలా వచ్చిందనా..! అంటే నేను మీరనుకునే మామూలు నత్తను కాదు. నాకు బోలెడు ప్రత్యేకతలున్నాయి. అవన్నీ మీకు తెలీదు కదా! అందుకే మీతో చెప్పడానికి వచ్చాను. మరి నా కథ వింటారా.. అయితే చదివేయండి..
ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్. మీకు గోళ్లు కత్తిరించుకుంటే పెరుగుతాయి కదా! అలా మా కళ్లకు ఏదైనా గాయమైనా, వాటిని కోల్పోయినా మళ్లీ పెరుగుతాయి. అదే మా అసలు ప్రత్యేకత. అలా అని మా కళ్లు మరీ అంత అద్భుతంగా కనిపించవు. ఏదో వెలుగు, నీడలు కనిపిస్తాయంతే! శత్రువు నుంచి మమ్మల్ని మేం కాపాడుకోవడానికి మాకు ఈ మాత్రం చాలు.
మా కళ్లే కాదు.. మేం కూడా..
మేం శాకాహారులం. దాదాపు 500 రకాల మొక్కలను మా ఆహారంలో భాగం చేసుకుంటాం. మా జీవిత కాలం 5 నుంచి 7 సంవత్సరాలు. నిజానికి మా కళ్లే కాదు.. మేం కూడా బతికి ఉన్నంత కాలం పెరుగుతూనే ఉంటాం.
పగలంతా బబ్బుంటాం..!
మేం.. మీరు చూసే నత్తలకంటే ఎక్కువ బరువుంటాం. అంటే దాదాపు 32 గ్రాములు. మా కవచం 4 నుంచి 7 అంగుళాల పొడవుతో, 7 నుంచి 9 పొరలతో మందంగా ఉంటుంది. కాబట్టి అంత తేలిగ్గా మాపై ఇతర జీవులు దాడి చేయలేవు. ‘మాకు ఎప్పుడూ నువ్వు కనిపించలేదు ఏంటి?’ అని మీరు నన్ను అడుగుదామనుకుంటున్నారు కదూ! మేం అన్ని చోట్లా ఉండం. కేవలం తూర్పు ఆఫ్రికా దీవుల్లో మాత్రమే కనిపిస్తుంటాం. మేం పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రిపూట మాత్రమే ఆహారాన్ని వెతుక్కుంటాం. ఇవీ నా విశేషాలు.. ఇక ఉంటామరి.. బై.. బై..!!