
క్రీడలు
హోస్టన్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక పతకం సాధించే అవకాశాన్ని భారత్ కొద్దిలో కోల్పోయింది. మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో మన జట్లు క్వార్టర్ఫైనల్లో ఓడిపోయాయి. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో మనిక బాత్రా-సత్యన్ 5-11, 2-11, 11-7, 9-11తో టొమాకాజు-హయాట (జపాన్)పై పోరాడి ఓడారు. తొలి రెండు గేమ్‌లు చేజారినా.. మూడో గేమ్‌లో పుంజుకుని గెలిచిన మనిక-సత్యన్‌కు నాలుగో గేమ్‌లో ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. మనిక-అర్చన కామత్ 1-11, 6-11, 8-11తో సారా డే-నిజియా లియాన్ (లక్సంబర్గ్) చేతిలో ఓడారు. సెమీస్ చేరి ఉంటే భారత్‌కు పతకం ఖాయమయ్యేది.