
తెలంగాణ
సొంత బ్రాండ్‌తో నాటుకోడి గుడ్లు, మాంసం విక్రయాలు
దళారుల ప్రమేయం లేకుండా ప్రముఖ సంస్థలకు సరఫరా
యువ రైతు విజయ సూత్రం
ఈనాడు - సంగారెడ్డి
అచ్యుత్‌రెడ్డి ఫాంలో పెంచుతున్న నాటుకోళ్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్‌రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. రుచికరమైన, నాణ్యమైన మాంసం, గుడ్లు అందిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదని భావించారు. దళారుల చేతికి చిక్కకుండా సొంత బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తూ ఏటా రూ.కోట్ల టర్నోవర్‌తో విజయపథంలో పయనిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంపై ఇతర రైతులకు సైతం తన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తూ.. వారికీ గిట్టుబాటు అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు.
2015లో మొదలుపెట్టి..
అచ్యుత్‌రెడ్డి హైదరాబాద్‌కు సుమారు 40 కి.మీ.ల దూరంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ గ్రామంలో మూడెకరాల్లో 2015లో 5 వేల కోళ్ల పెంపకం మొదలుపెట్టారు. దళారుల ప్రమేయం ఉండొద్దన్న ఉద్దేశంతో సొంతంగా ‘న్యూట్రీఫ్రెష్’, ‘ఎపీక్యూర్’ బ్రాండ్ల పేరుతో గుడ్లు, మాంసం విక్రయాలు ప్రారంభించారు. ప్రచారానికి వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లనూ ఉపయోగించుకున్నారు. బుధ, శుక్ర, ఆదివారాల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే తెచ్చి సరఫరా చేస్తారు. మాంసం విక్రయానికి లీషియస్, ఫిపొలా, టెండర్ కట్స్‌తో పాటు మరో మూడు సంస్థలతో అచ్యుత్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతినెలా 1,500 కిలోల మాంసం, దాదాపు 10 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. 250 మంది రైతులతోనూ ఒప్పందం చేసుకున్నారు. వారు సరఫరా చేసే కోళ్ల మాంసాన్ని తన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రాసెసింగ్ చేసిన నాటుకోడి మాంసాన్ని చూపుతున్న అచ్యుత్‌రెడ్డి
సరైన మార్కెటింగ్ తోనే మంచి రాబడి
* కోళ్ల మార్కెటింగే అత్యంత కీలకం. ఇప్పటికే కోళ్లను పెంచుతున్న రైతుల అనుభవాలను తెలుసుకోవాలి. అవగాహనలేకుండా ప్రారంభిస్తే నష్టాలు తప్పవు.
* 5 వేల నాటుకోళ్లకు షెడ్డు ఏర్పాటు కోసం రూ.6.50 లక్షల నుంచి రూ.7.50 లక్షల ఖర్చవుతుంది. కోళ్లు సహజ వాతావరణంలో బయట తిరిగేందుకు కనీసం ఎకరా నుంచి మూడెకరాల వరకు స్థలం అవసరం.
* ఒక్కో కోడిపిల్ల ధర రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది. 5 వేల పిల్లల కొనుగోలుకు, వాటిని 90 నుంచి 100 రోజుల పాటు పెంచేందుకు రూ.9 లక్షల వరకు ఖర్చవుతుంది. అప్పటికి కిలోన్నర బరువు పెరుగుతాయి. దాదాపు 8,500 కిలోల కోళ్లు తయారవుతాయి. మార్కెట్లో కిలో కోడి(లైవ్) రూ.180 చొప్పున అమ్మినా దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. రెండో విడత నుంచి పెట్టుబడి తిరిగివచ్చి.. లాభాల ఆర్జన మొదలవుతుందని అచ్యుత్‌రెడ్డి తెలిపారు.
అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో
- అచ్యుత్‌రెడ్డి
నాటుకోడి గుడ్లు, మాంసానికి ఉన్న డిమాండ్‌నే నేను అందిపుచ్చుకున్నా. సొంత బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టడం కలిసొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల మార్కును దాటాం. ఈసారి రూ.10 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 30 మందికి ఉపాధి కల్పిస్తున్నా.