HD revanna: కిడ్నాప్‌ కేసు.. సిట్‌ అదుపులో హెచ్‌డీ రేవణ్ణ

మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది.

Updated : 04 May 2024 19:47 IST

బెంగళూరు: ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ అపహరణ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను (HD revanna) ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుంది. పద్మనాభ నగర్‌లోని మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నివాసంలో రేవణ్ణను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేవణ్ణకు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ మంజూరుచేసేందుకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో ఐదారుగురు సిట్‌ అధికారులు దేవెగౌడ నివాసానికి వెళ్లి రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు.

ఓ మహిళ కిడ్నాప్‌ వ్యవహారంలో రేవణ్ణ అరెస్ట్‌ చోటుచేసుకుంది. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన తన తల్లి కిడ్నాప్‌కు గురైందని బాధితురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో 364ఏ కిడ్నాప్‌, 364, అక్రమంగా బంధించటం వంటి సెక్షన్ల కింద రేవణ్ణపై కేసు నమోదైంది. మరోవైపు లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు, ఆ కృత్యాల చిత్రీకరణ, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామంటూ బ్లాక్‌మెయిలింగ్‌, కిడ్నాప్‌ వంటి ఆరోపణలపై తండ్రీకొడుకులపై కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నేపథ్యంలో భారత్‌కు రాగానే అతడినీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని