Sandeshkhali: సందేశ్‌ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ

సందేశ్‌ఖాలీ ఘటనలు భాజపా ముందస్తు కుట్రేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.

Updated : 04 May 2024 18:54 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన సందేశ్‌ఖాలీ వ్యవహారం (Sandeshkhali incidents)లో కొత్త కోణాన్ని అధికార టీఎంసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదంతా లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు పశ్చిమ బెంగాల్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా (BJP) పన్నిన కుట్రేనని ఆరోపిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో తననుతాను భాజపా సందేశ్‌ఖాలీ మండలాధ్యక్షుడిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. ఈ ఘటనల వెనక ప్రతిపక్ష నేత సువేందు అధికారి హస్తం ఉందని ఆరోపించాడని తెలిపింది. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) సైతం ఈ ఘటనలు కమలం పార్టీ ముందస్తు ప్రణాళికలేనని ఆరోపించారు.

‘‘సువేందునే స్వయంగా సందేశ్‌ఖాలీ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆయుధాలు పెట్టారు. వాటిని కేంద్ర సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు చూపించారు’’ అని ఆ వ్యక్తి వీడియోలో ఆరోపించాడు. బెంగాల్‌, సందేశ్‌ఖాలీ పరువు తీసేందుకే కొంతమందికి డబ్బులు చెల్లించి మరీ సామూహిక అత్యాచారాల తప్పుడు కథనాన్ని సృష్టించారని సువేందుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ-షా, కేంద్ర సంస్థలు, వారి మిత్రపక్షాల పన్నాగం బట్టబయలైందని పేర్కొంది.

బెంగాల్‌ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్‌భవన్

‘’సంబంధిత ఘటనలను భాజపా ముందస్తుగానే పకడ్బందీగా ప్లాన్‌ చేసింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. నేను చాలాకాలంగా ఇదే చెబుతున్నాను. దేశ చరిత్రలో కేంద్రంలోని పాలకపక్షం.. మొత్తం రాష్ట్రాన్ని, దాని ప్రజలను కించపరిచేందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. ప్రధాని నరేంద్రమోదీ సందేశ్‌ఖాలీపై అనేక సందేశాలు ఇచ్చారు. కానీ, గవర్నర్‌ లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారు’’ అని మమతా విమర్శించారు. ఈ ఆరోపణలపై భాజపా నేత, పార్టీ అధికార ప్రతినిధి శంకుదేబ్ పాండా స్పందిస్తూ.. సందేశ్‌ఖాలీ ఘటనలను ఎదుర్కొనేందుకు వేరే దారి లేక తప్పుడు వీడియోను అప్‌లోడ్ చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని