
గ్రేటర్ హైదరాబాద్
విశాఖ బీచ్‌రోడ్డులో అలల తాకిడికి వంగిపోయిన రక్షణ గోడ, ఛిద్రమైన పరిసరాలు
పెదవాల్తేరు, న్యూస్‌టుడే - ఈనాడు, హైదరాబాద్: విశాఖ తీరంలో శనివారం రాత్రి సముద్ర అలలు బీభత్సం సృష్టించాయి. జవాద్ తుపాను కారణంగా మూడు రోజులుగా ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంది. తుపాను దిశ మార్చుకొని ఒడిశా వైపు పయనించడంతో నగరానికి ముప్పు తప్పిందని భావిస్తుండగా.. రాత్రి వేళ కెరటాలు బీభత్సం సృష్టించాయి. బీచ్‌రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల దూరం తీరాన్ని ధ్వంసం చేశాయి. పార్కు గోడ కూలిపోయింది. భూకంపం తర్వాతి పరిస్థితిని తలపించేలా నేల చీలిపోయి పచ్చిక బయళ్లు కిందకు కుంగిపోయాయి. జవాద్ తుపాను ఆదివారం బలహీనపడి వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత బలహీనపడనుంది. తెలంగాణలో రెండు రోజుల్లో చలి పెరుగుతుందని కేంద్రం రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.