
తెలంగాణ
బనాయించిన కేసుల్ని ఎత్తేసాం
రైతు నేతలకు కేంద్రం ఆఫర్
వెంటనే నిరసనలు విరమించాలని షరతు...
ఆ నిబంధనపై సంయుక్త కిసాన్ మోర్చా అభ్యంతరం
దిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న రైతు సంఘాల నేతలు
దిల్లీ: నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా, పంటల కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత సాధన కోసం దిల్లీ సరిహద్దుల్లో ప్రారంభమైన రైతు ఉద్యమం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, ఆందోళనల సమయంలో బనాయించిన కేసులన్నిటినీ ఎత్తివేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని రైతు నేతలకు చేరవేయడమే కాక హామీ పత్రం ముసాయిదా ప్రతిని వారి వద్దకు పంపినట్లు సమాచారం. ఆ ప్రతిని అందుకున్న సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు మంగళవారం దిల్లీ సింఘు సరిహద్దులో సమావేశమై విస్తృతంగా చర్చించుకున్నారు. ప్రభుత్వం పెట్టిన ఒక షరతుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు.
అభ్యంతరమైనవి ఏమిటంటే..
తమ డిమాండ్లకు అంగీకారం తెలుపుతూ కేంద్రం పంపిన ప్రతిపాదనల్లో కొన్ని అభ్యంతరకరమైని ఉన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. నిరసనలు విరమిస్తేనే రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామనడాన్ని తప్పుపట్టారు.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు కూడా అభ్యంతరం తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చాతో, ఉద్యమంతో సంబంధం లేని రైతు సంఘాలను ఈ కమిటీలో ప్రభుత్వం భాగం చేయనుందని ఆరోపించారు. తమ డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్న రైతు సంఘాల సభ్యులను కమిటీలో చేర్చడం ఆమోదనీయం కాదని పేర్కొన్నారు.
కేంద్రం ప్రతిపాదనలు..
* ఎంఎస్పీకి చట్టబద్ధతపై కమిటీ ఏర్పాటు
* ఆ కమిటీలో ప్రభుత్వ అధికారులతో పాటు వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు, ఎస్కేఎం ప్రతినిధులకు స్థానం
* నిరసనల వేళ రైతులపై పెట్టిన కేసులు, పంటవ్యర్థాల దహనం అభియోగాలతో నమోదైన కేసులన్నీ రద్దు
* ఈ హామీలన్నిటినీ లిఖితపూర్వకంగా ఇచ్చేందుకు సుముఖత