తప్పిన పెను విధ్వంసం

ఆరేళ్ల తరువాత మరో కుట్ర.. అడ్డుకట్ట

ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రాష్ట్ర రాజధానిలో ప్రశాంతత భగ్నమయ్యేది. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబుపేలుళ్ల తర్వాత మరోమారు హైదరాబాద్‌లో తీవ్ర అలజడి రేగేది. విదేశాల్లో తిష్టవేసిన ఉగ్రవాదులు భాగ్యనగరంలో విధ్వంసమే లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు విజయవంతంగా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పాత నేరస్థుడు జాహెద్‌తోపాటు మరో ఇద్దర్ని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో రాష్ట్రం మరోమారు ఉలిక్కిపడింది.
-  2016లో ఐసిస్‌ అనుబంధ సంస్థ ‘అన్సార్‌ ఉల్‌ తౌహీద్‌ సీ బిలాద్‌ అల్‌ హింద్‌’ (ఎ.యు.టి.) తలపెట్టిన విధ్వంసాన్ని కూడా పోలీసులు ముందే పసిగట్టి అడ్డుకున్నారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో శక్తిమంతమైన బాంబులు పేల్చేందుకు పన్నిన ఆ కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. హైడ్రోజెన్‌ పెరాక్సైడ్‌, అసిటోన్‌, యూరియా వంటి పదార్థాలతో రూపొందించిన ‘టైసిటోన్‌ ట్రై పెరాక్సైడ్‌’ (టీఏటీపీ) బాంబులను పేల్చాలని వ్యూహం పన్నిన హైదరాబాద్‌కు చెందిన 11 మంది యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. అదే ఏడాది జనవరిలోనూ దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై 14 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేయగా అందులో నగరానికి చెందిన నలుగురు ఐసిస్‌ సానుభూతిపరులు కూడా ఉన్నారు.

గతంలో  ఘాతుకాలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచీ హైదరాబాద్‌లో అనేక ఉగ్రదాడులు జరిగాయి. 1992లో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదుల చేతిలో నిఘా విభాగానికి చెందిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్‌ హతమయ్యారు. ఆ ఘటన అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచీ ఏదో ఒక ఉగ్రచర్య వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా ప్రయత్నాలను పోలీసులు ముందుగానే పసిగడుతున్నా కొన్నిసార్లు ఉగ్రవాదులదే పైచేయి అవుతోంది. అందులో ప్రధానమైనవి 2007 ఆగస్టు 25న లుంబినీపార్కు, గోకుల్‌చాట్‌ల వద్ద జరిగిన జంటపేలుళ్లు. వీటిలో 42 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు.

* 2005 అక్టోబరులో బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో జరిగిన మానవబాంబు దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2007 మే నెలలో హిందూ అతివాద సంస్థ అభినవ్‌భారత్‌ మక్కా మసీదులో పేలుళ్లకు పాల్పడింది. 2013 ఫిబ్రవరిలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్లు మరోమారు ప్రకంపనాలు సృష్టించాయి. ఆ తర్వాత పలు కుట్రలను పోలీసులు భగ్నం చేయడంతో నగరం ప్రశాంతంగా ఉంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని