Handloom sector: ప్రోత్సాహంతోనే మగ్గానికి ఊపిరి

రేపు జాతీయ చేనేత దినోత్సవం

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమం కింద ఇంటింటా మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కేంద్రం సంకల్పించింది. అందుకోసం చైనా నుంచి వాటిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం- దేశంలోని చేనేత, ఖాదీ, హస్తకళా రంగాల దయనీయ పరిస్థితిని చాటుతోంది. భారత్‌లో ఆ మేరకు ఉత్పత్తి సామర్థ్యం లేదని కేంద్రమే వెల్లడించడం ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనం. చేనేత, ఖాదీ ఉత్పత్తి చిహ్నాలైన మగ్గాలు, చరఖాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యాలకు ప్రతీకగా జాతిపిత మహాత్మాగాంధీ అభివర్ణించారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో చేనేతరంగం విశిష్టపాత్ర పోషించింది. దురదృష్టవశాత్తు, ఇప్పుడు ఆ రంగమే కనుమరుగవుతోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో చేనేత రంగం అంతర్ధానమయ్యే దుస్థితి దాపురిస్తోంది.

కఠిన వాస్తవాలు
స్వాతంత్య్రోద్యమం నాటికి చేనేత కుటుంబాల సంఖ్య కోటికి పైగా ఉంది. 1970 నాటికి అది నాలుగు కోట్లకు పెరిగింది. ఆ తరవాత క్రమేపీ కష్టకాలం మొదలైంది. యంత్రాలతో కూడిన మిల్లులు రంగంలోకి దిగి పాలియెస్టర్‌, టెరికాటన్‌ ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా క్రమేపీ చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గింది. అధునాతన యంత్రాల వాడకం కొత్తపుంతలు తొక్కగా- జౌళి రంగం చేనేతను దాటి ముందడుగు వేసింది. చేనేతపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. 2009-10లో 43.31 లక్షలున్న చేనేత వృత్తిపరివారం సంఖ్య 2020-21 నాటికి 29.25 లక్షలకు తగ్గిందని తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 35 ఏళ్లలోపు కార్మికులు 2009-10లో 26.13 లక్షల మంది. 2020-21 నాటికి వారి సంఖ్య 12.07 లక్షలకు తగ్గడం ఈ వృత్తిపై కొత్తతరం విముఖతను చాటుతోంది. కనీస వేతన చట్టం మేరకు చేనేత కార్మికుడు నెలకు కనీసం రూ.6,275 సంపాదించగలగాలి. ఇప్పటికీ 27,48,445 మంది కార్మికులు నెలకు రూ.5,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. కార్మికుల్లో 76శాతం రుణాలతోనే వృత్తిని కొనసాగిస్తున్నారు. దేశంలో చేనేత చీరల వాడకం 19శాతమే. మిగతా 81శాతం మిల్లులు, యంత్రాలపై తయారైన చీరలే. ఏటా దేశంలో జరిగే దుస్తుల విక్రయాల్లో చేనేత వాటా తొమ్మిది శాతమే. చివరికి సన్మానాలకు ఉపయోగించే శాలువాల వంటివి సైతం మరమగ్గాలపైనే తయారవుతున్నాయి.

పరిష్కారమేదీ?
చేనేత రంగం శాశ్వతంగా కొనసాగడానికి వీలుగా సమగ్ర కార్యాచరణ తక్షణావసరం. దీనికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలుసైతం చొరవ చూపాలి. వృత్తి పరిరక్షణ కోసం చేనేతకు అవసరమైన చేయూతనివ్వాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతను మేళవించాలి. ఉత్పత్తిని పెంచి, చౌక ధరలతో వస్త్రాలు అందించడానికి వీలుగా యంత్రాల     వినియోగాన్ని ప్రారంభించాలి. తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు మల్లేశం రూపొందించిన ‘ఆసు యంత్రం’ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి యంత్రాల వాడకం కార్మికులకు సౌలభ్యంగా ఉంటుంది. కార్మికులకు డిజిటల్‌ సేవలందించి, అధునాతన డిజైన్లపై అవగాహన కల్పించడంతో పాటు వాటికి అవసరమైన సాంకేతిక సాయం అందించాలి. జౌళిరంగం మినహాయిస్తే చేనేతలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. గుజరాత్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు చేనేత, జౌళిని మిళితం చేసి పథకాలను నిర్వహిస్తున్నాయి. చేనేతకు మార్కెట్‌ పెంచేందుకు వీలుగా ఇ-కామర్స్‌ వేదికలను వాడుకోవాలి. పన్నుల స్థానంలో రాయితీలను ఇవ్వాలి. కేంద్రంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తికి ఆలంబనగా నిలిచే పథకాలను చేపట్టాలి. తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఉచిత దుస్తుల పథకాన్ని అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్దయెత్తున చీరలు; రంజాన్‌, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా దుస్తులు తయారు చేయించి నేత కార్మికులకు ఆసరాగా నిలుస్తోంది. స్వతంత్రభారత వజ్రోత్సవాల కోసం 1.20 కోట్ల జెండాలను స్థానికంగా ఉన్న సిరిసిల్ల ఇతర ప్రాంతాల కార్మికులతో తయారు చేయించి వారికి ఆర్థికంగా భరోసా ఇస్తోంది. విద్యార్థుల కోసం ఉచిత దుస్తుల పథకాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తూ చేనేతకు చేయూతనిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు వీటిని ఆదర్శంగా తీసుకోవాలి.


పన్నుల భారం

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2015లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రంగానికి అన్ని విధాలా చేయూతనిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఆ తరవాత అనూహ్యంగా అయిదుశాతం జీఎస్టీని విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆ రంగానికి మరణశాసనంగా మారింది. ఇప్పటికే ముడిసరకుల ధరలు, ఇతరత్రా ఖర్చుల   కారణంగా చేనేత ధరలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో వస్త్రాల కొనుగోలుకు సాధారణ వినియోగదారులు దూరమవుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర నిర్ణయం పిడుగుపాటుగా మారింది. చేనేత కొనుగోళ్లు తగ్గాయి. అనంతరం చేనేతపై జీఎస్టీని అయిదుశాతం నుంచి 12 శాతానికి పెంచాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమయింది. తెలంగాణ చేనేత శాఖ మంత్రి కేటీ రామారావు, ఇతర ప్రముఖులు లేఖలు రాయడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. అయిదు శాతం జీఎస్‌టీని సైతం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు.


ఎవరిది వైఫల్యం?

* చేనేత కళను భారత్‌ నుంచి చైనా ఆపోశన పట్టింది. ఏడో దశాబ్దం వరకు భారత చేనేత వస్త్రాలు చైనాకు ఎగుమతి అయ్యేవి.

* క్రమేపీ పరిస్థితి మారింది. చైనా చేనేతకు మెరుగులు దిద్దుతూ వస్త్రాల ఎగుమతుల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది.

* అక్కడి ప్రజలకు ప్రభుత్వమే దారి చూపడం వల్ల అద్భుతాలను సాధించింది. ఇక్కడి ప్రభుత్వాల్లో అటువంటి చొరవ కొరవడింది.

* యూపీఏ ప్రభుత్వం 2011లో పునరుద్ధరణ, సంస్కరణ, పునర్నిర్మాణం పేరిట ఆరు వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించింది. చివరికి ఈ పథకానికి రూ.2825 కోట్లను కేటాయించింది. 2014 వరకు రూ.760 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

* 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ కేటాయింపులు తగ్గాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు రూ.410 కోట్లు మాత్రమే. అందులో పదోవంతు కూడా ఇప్పటివరకు వెచ్చించలేదు.

* రైల్వే, సైనిక దళాలు ఇతర ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చేనేత దుస్తుల వాడకాల ద్వారా ప్రోత్సాహాన్ని అందించాల్సి ఉన్నా... దానికి కేంద్రం అనుమతించలేదు.


- ఆకారపు మల్లేశం


మరిన్ని

ap-districts
ts-districts