ముందుగానే ఆర్థిక భారాన్ని మదించాలి

సుప్రీంకు అశ్వినీ ఉపాధ్యాయ్‌ నివేదన

దిల్లీ: ఉచిత పథకాలను అందజేసే ముందు దానివల్ల ఖజానాపై పడే ఆర్థిక భారాన్నీ అంచనా వేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు. భారాన్ని ఏమాత్రం పరిగణనలో తీసుకోకుండా నిర్హేతుకమైన తాయిలాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిల్‌ దాఖలు చేశారు. దీర్ఘకాలంలో ఆర్థికంగా, బడ్జెట్‌ నిర్వహణపరంగా పడే భారం ఎంతనేది పట్టించుకోకుండా రాష్ట్రాలు ఉచిత తాయిలాలను ఇచ్చుకుంటూ వెళ్తుండడంపై అత్యున్నత ఆర్థిక సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేసిన విషయాన్ని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా ప్రస్తావించారు. ‘‘భారత ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాలు ఇంకా తీరకముందే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా అప్పులు చేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల్ని అవి పాటించడం లేదు. దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడానికి క్రెడిట్‌ రేటింగును ప్రవేశపెట్టాలి. ఎడాపెడా ఉచిత హామీలు ఇవ్వకుండా ఉండేందుకు ఏం చేయాలో సూచించే నిపుణుల కమిటీని నియమించాలి’’ అని పిటిషనర్‌ కోరారు. ఉచితాలపై కేంద్రం, నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, ఆర్‌బీఐ వంటివి మేధోమథనం జరిపి నిర్మాణాత్మక సూచనలు చేయాలని సుప్రీంకోర్టు ఈ నెల 3న ఆదేశించింది.


మరిన్ని

ap-districts
ts-districts