Nitish Kumar: ఎనిమిదో సారి.. సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారం

ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌

పట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. భాజపాతో బంధం తెంచుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమితో జట్టుకట్టారు. ఆ కూటమి సారథిగా నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌.. నీతీశ్‌ చేత ప్రమాణం చేయించారు. కాగా.. బిహార్‌ సీఎంగా నీతీశ్‌ బాధ్యతలు చేపట్టడం ఇది 8వ సారి. ఇక, కూటమిలోని కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి, తల్లి రబ్ఢీదేవి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ తదితరులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో నీతీశ్‌ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నీతీశ్‌ నిర్ణయాన్ని లాలూ సమర్థించి.. ఆయనను అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి.

భాజపా అధినాయకత్వంపై కొన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్న నీతీశ్ కుమార్‌.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకున్నారు. ఆ కూటమి నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన కాసేపటికే మహాకూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. ప్రత్యర్థి ఆర్జేడీ పార్టీతో మళ్లీ చేతులు కలిపారు. 7 పార్టీలతో కూడిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ గవర్నర్‌ను కోరారు. అందుకు ఆయన ఆమోదించడంతో నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆర్జేడీ నుంచి మరో నేతకు స్పీకర్‌ పదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, మరో మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంతో 2015లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ నీతీశ్‌ సీఎంగా ఉండగా.. తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. లాలూ మరో తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు అప్పుడు మంత్రి పదవి దక్కగా.. కొత్త ప్రభుత్వంలోనూ మరోసారి మంత్రిత్వ శాఖలను అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని