Asia Cup : చాహర్‌, రాహుల్‌ పునరాగమనం?

ఆసియాకప్‌కు జట్టు ఎంపిక 8న

దిల్లీ: ఆసియాకప్‌ కోసం సెలక్షన్‌ కమిటీ ఈ నెల 8న భారత జట్టును ప్రకటించనుంది. గాయాల నుంచి కోలుకున్న రాహుల్‌, పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ జట్టుకు ఎంపికవుతారని భావిస్తున్నారు. హెర్నియాకు ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న రాహుల్‌.. నిజానికి జింబాబ్వేతో వన్డే సిరీస్‌కే జట్టులోకి రావాల్సింది. కానీ కరోనా సోకడం వల్ల..  అతడు కోలుకునే ప్రక్రియ ఆలస్యమైంది. చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఎప్పటిలాగే 15 మందిని ఎంపిక చేస్తుందా లేదా అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కోసం 17ను ఎంపిక చేస్తుందా అన్నది ఆసక్తికరం. ఆసియాకప్‌లో ఆడే జట్టే దాదాపుగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశముంది. గత ఆరు టీ20ల్లో రోహిత్‌తో కలిసి పంత్‌ లేదా సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనింగ్‌ చేశారు. రాహుల్‌ ఇప్పుడు తన ఓపెనింగ్‌ స్థానాన్ని తాను దక్కించుకుంటాడు. రాహుల్‌ కొత్తగా నిరూపించుకునేదేమీ లేదని.. సూర్య, పంత్‌ స్పెషలిస్ట్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆడతారని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జింబాబ్వేతో సిరీస్‌తో వన్డే పునరాగమనం చేయనున్న పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌.. ఆసియాకప్‌తో టీ20ల్లోకి కూడా తిరిగొస్తాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్‌ పటేల్‌ ఎంపిక అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అశ్విన్‌, జడేజా, చాహల్‌, అక్షర్‌ పటేల్‌లతో ప్రపంచకప్‌కు వెళ్లాలనుకుంటున్న నేపథ్యంలో ఆఫ్‌స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఆసియాకప్‌కు ఎంపికయ్యే అవకాశం లేదు. షమిని టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆసియాకప్‌ టీ20 టోర్నమెంట్‌ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు జరగనుంది.


మరిన్ని

ap-districts
ts-districts