యువ ఉద్యమిత వికాస్‌ అభియాన్‌-1 కింద ఏపీ-116, తెలంగాణ నుంచి 430 మంది ఉత్తీర్ణత

ఈనాడు, దిల్లీ:  ప్రధానమంత్రి యువ ఉద్యమిత వికాస్‌ అభియాన్‌-1 కింద తుది మదింపులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 116 మంది, తెలంగాణ నుంచి 430 మంది ఉత్తీర్ణులయ్యారని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడీఎఫ్‌) కింద 2019-20 నుంచి 2021-22 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.5,728.66 కోట్లు, తెలంగాణకు రూ.3,705.27 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మూడు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. నరసరావుపేట, మచిలీపట్నం ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

తెలుగు భాషాభివృద్ధికి రూ.275.80 కోట్ల వ్యయం

2019-20 నుంచి 2021-22 వరకు మూడేళ్ల కాలంలో తెలుగు భాషాభివృద్ధికి రూ.357.15 కోట్లు కేటాయించగా రూ.275.80 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) కింద 4,56,731 మంది, జనశిక్షణ సంస్థాన్‌ (జేఎస్‌ఎస్‌)లో 35,942, ఐటీఐల్లో 4,30,490 మంది వృత్తిపరమైన శిక్షణ పొందారని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

డ్రోన్‌ సెక్టార్‌లో పరిశోధన, అభివృద్ధి అంశాలకు సంబంధించిన కోర్సులను హైదరాబాద్‌ ఐఐఐటీ, ఐఐఎస్సీ బెంగళూరు, బాంబే, కాన్పుర్‌, మద్రాస్‌ ఐఐటీలు, పుణె డీఐఏటీ, అన్నా యూనివర్సిటీ ప్రారంభించినట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అరకు, విజయనగరం ఎంపీలు గొడ్డేటి మాధవి, బెల్లాన చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి  ఈ వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో షార్ట్‌ టర్మ్‌ డ్రోన్‌ కోర్సులకు 11 ఐటీఐలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.

దేశంలో 2016-17లో బ్యాంకింగ్‌ వ్యవస్థ రూ.43.36 కోట్లు విలువగల నకిలీ నోట్లను గుర్తించగా 2021-22 నాటికి అది రూ.8.25 కోట్లకు తగ్గిపోయిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. కర్నూలు ఎంపీ సింగారి సంజీవ్‌ కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2017లో రూ.28.10 కోట్ల నకిలీ కరెన్సీని సీజ్‌ చేయగా 2020లో రూ.92.18 కోట్లు సీజ్‌ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన-2 కింద (పీఎంకేవీవై) ఏపీకి రూ.54.93 కోట్లు విడుదల చేయగా రూ.43.12 కోట్లు వ్యయం చేశారని, పీఎంకేవీవై-3 కింద రూ.2.46 కోట్లు విడుదల చేశామని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ ప్రత్యుత్తరమిచ్చారు. పీఎంకేవీవై-2 కింద తెలంగాణకు రూ.31.55 కోట్లు విడుదల చేయగా రూ.22.95 కోట్లు వ్యయం చేశారని, పీఎంకేవీవై-3 కింద రూ.2.57 కోట్లు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు.

బ్యాంకు లావాదేవీలకు సంబంధించి 51,447 ఫిర్యాదులు  

బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జులై 25వ తేదీ వరకు 51,447 ఫిర్యాదులు అందగా 37,640 పరిష్కరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.

ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 8 యూనిట్ల సామర్థ్యం 32,122.50 టన్నులు కాగా తెలంగాణలోని 18 యూనిట్ల సామర్థ్యం 1,13,012 టన్నులని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

నదుల పరిరక్షణకు సంబంధించిన డీపీఆర్‌ ప్రకారం గోదావరిలో 849.23 కి.మీ., కృష్ణా నదిలో 2,315.44 కి.మీ. శుద్ధి చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు.

వైద్య పర్యాటకం కింద 2021లో దేశానికి 3,03,526 మంది విదేశీయులు రాగా అందులో అత్యధికంగా బంగ్లాదేశ్‌ నుంచి 1,86,633 మంది, మాల్దీవుల నుంచి 22,798 మంది వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, మేడారం జాతరకు రూ.50 లక్షలు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

పురావస్తు తవ్వకాలకు సంబంధించి 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణలో 15 గ్రామాల్లో సర్వే చేయగా పది గ్రామాల్లో పురావస్తు అవశేషాలు ఉన్నట్లు గుర్తించామని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఏపీలో 135 రక్షిత కట్టడాలు, తెలంగాణలో 8 ఉన్నాయని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని