మ్యూజిక్‌ పబ్‌లో అగ్నిప్రమాదం

తూర్పు థాయిలాండ్‌లో 14 మంది మృతి
పలువురికి గాయాలు

బ్యాంకాక్‌: తూర్పు థాయిలాండ్‌లో శుక్రవారం రద్దీగా ఉన్న ఓ మ్యూజిక్‌ పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ తలుపు, ప్రవేశమార్గం నుంచి పెద్దఎత్తున నల్లని పొగ బయటకు వస్తుండగా, అదే మార్గం నుంచి ప్రజలు బయటకు పరుగులు తీయడం, ఈ క్రమంలో పలువురి వస్త్రాలకు మంటలు అంటుకోవడం కనిపించింది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా 160 కిలోమీటర్ల దూరంలో చొన్బురి ప్రావిన్స్‌లోని సత్తాషిప్‌ జిల్లాలో మౌంటెయిన్‌ బి పబ్‌లో అగ్నిప్రమాదం సంభవించిందని, ఇందుకు కారణం తెలియాల్సి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి కొద్దిగా ముందుగా 12.45 గంటలకు పబ్‌లో అగ్నికీలలు చెలరేగాయని వివరించారు. తొలుత పబ్‌లోని వేదిక సమీపంలో మంటలు కనిపించాయని, అనంతరం భారీ పేలుడు సంభవించిందని పలువురు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts