close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చీర కట్టు... సంస్కృతి తెలిసేట్టు!

చీర మన చరిత్ర...
చీర మన ఆత్మవిశ్వాసం...
అంటూ ఆరు గజాల చీరకు ఆదరణ కల్పించాలనుకున్నారామె.
అంతరించిపోతోన్న చేనేతకు ఊపిరి పోయాలనుకున్నారు.
అందుకోసం ఆరేళ్ల కిందట ‘6 యార్డ్స్‌ అండ్‌ 365 డేస్‌’ పేరుతో ఓ ఫేస్‌బుక్‌ గ్రూపుని ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఆ బృందంలో దేశవ్యాప్తంగా నలభైవేల మంది సభ్యులున్నారు. అంతరించిపోతోన్న అరుదైన చీరల రకాలను అందుబాటులోకి తేవడంతోపాటు నేతన్నల సంక్షేమానికీ కృషి చేస్తున్నారు. దీనికి నాయకురాలు దిల్లీకి చెందిన 67 ఏళ్ల సునీత బుధిరాజ. ఆ వివరాలేంటో చూద్దామా!

‘మనదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. ప్రతి ప్రాంతానికీ ఓ చరిత్ర ఉంటుంది. అదే గొప్పదనం చీరల్లోనూ కనిపిస్తుంది. మహిళల జీవితంలో ఓ భాగమైన వీటికి ఆ ఘనత అందాల్సిందే’ అని అంటారు సునీత. చీరకట్టుకి ప్రచారం కల్పించే ఉద్దేశంతోనే  ‘6 యార్డ్స్‌ అండ్‌ 365 డేస్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని ప్రారంభించారామె. వ్యాపారరీత్యా తరచూ దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసేవారు. అప్పుడే ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకమైన చీర కనిపించేది. అక్కడి నేతకార్మికుల పనితనం చూసి అబ్బురపడేవారామె. అయితే అదే సమయంలో ఎన్నో అరుదైన డిజైన్లు మూలన పడిపోయాయన్న విషయం గమనించారు. అంతేకాదు...వాటిపై ఆధారపడే కార్మికులు కనీస ఆదాయం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నారు. ఆ చర్చ తర్వాత ఆయా ఉత్పత్తులకు ఆదరణ కల్పించేందుకు ఏదైనా చేయాలనుకున్నారు. అప్పుడు వచ్చిందే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు ఆలోచన. అలా 2015లో నలుగురితో మొదలైంది.

నేతన్నలకు ఉపాధి కల్పిస్తూ...
ఈ గ్రూప్‌లో ప్రతి ఒక్కరూ తమ చీరల గురించీ, వాటికున్న చరిత్ర గురించి అభిప్రాయాలను పంచుకోవడం ప్రారంభించారు. క్రమంగా సభ్యుల సంఖ్య వేలకు చేరింది. ఈ బృందంలో గృహిణులు...వైద్యులు, నటీమణులు, న్యాయవాదులు, రచయిత్రులు, విద్యావేత్తలు, వాణిజ్యవేత్తలు, డిజైనర్లు, చేనేతకార్మికులు... ఇలా నలభైవేలమంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా కలిసి మవెరిక్‌, బటర్‌ఫ్లై డిజైన్‌ లాంటి మరుగున పడిన చీరలకు ఆదరణ కల్పించారు. సభ్యులు తమ అవసరాలను, తమకు నచ్చిన చీరలను ఈ గ్రూపులో ప్రదర్శిస్తారు. అవసరమైతే దానిలో నైపుణ్యం ఉన్న కార్మికులను సంప్రదించి...వాటిని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది సునీత బృందం. ఇలా పశ్చిమబంగ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు...అన్ని ప్రాంతాల్లోనూ ఇటు చేనేత కార్మికులకు- అటు మహిళలకు మధ్య వారధిలా పనిచేస్తోంది. దీంతోపాటు ముంబయి, పుణె, బెంగళూరు, దిల్లీ లాంటి నగరాలు, పలు పట్టణాలతోపాటు 70 దేశాల్లోనూ వీరు సమావేశాలు నిర్వహించారు. ఫ్యాషన్‌ షోలు నిర్వహించి స్థానికనేత కార్మికులకు ఉచితంగా స్టాళ్లు పెట్టుకునే అవకాశం కల్పిస్తారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నగదును సేకరించి బెనారస్‌, చందేరీ, మహేశ్వర్‌, బలూచ్‌, విష్ణుపుర్‌, అసోం... నేతన్నలు 100 మందికి చేయూత అందించారు.


మరిన్ని