close

ఫీచర్ పేజీలు

ఇక సైలెంట్‌గా.!

ఉత్తమ జాబితాలో లేని హైదరాబాద్‌, సైబరాబాద్‌ ఠాణాలు
ఏడాదిన్నరకే పరిమితమైన నాణ్యమైన గుర్తింపు

జనవరి 2018
ప్రజామిత్ర పోలీసింగ్‌.. విదేశీ నగరాల తరహాలో నేర నియంత్రణ... శాంతిభద్రతల పరిరక్షణలో అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నాణ్యమైన సేవలందిస్తున్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పంజాగుట్ట పోలీస్‌ ఠాణా దేశవ్యాప్తంగా రెండో ఉత్తమ ఠాణాగా నిలిచింది..

జూన్‌, 2019
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్‌ ఠాణాల ర్యాంకులను విడుదల చేసింది. పంజాగుట్ట పోలీస్‌ ఠాణాకు ఈ జాబితాలో స్థానం దక్కలేదు.

ఈనాడు, హైదరాబాద్‌

అత్యుత్తమ సేవలు... దొంగలను పట్టుకునేందుకు డిటెక్టివ్‌ పోలీసుల నిరంతర కృషితో దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్‌ ఠాణాగా నిలిచింది పంజాగుట్ట పోలీస్‌ ఠాణా. ఏడాదిన్నరలోనే ప్రమాణాలకు అందుకోలేని పరిస్థితి ఏర్పడటంతో హై-ఫై పోలీస్‌ఠాణాలు ఆరంభ శూరత్వమేనా అన్న భావన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు అత్యాధునిక సాంకేతిక సమాచారంతో రూపుదిద్దుకున్న ఆధునిక పోలీస్‌ ఠాణాలున్న సైబరాబాద్‌ పోలీస్‌ ఠాణాల్లో ఒక్కదానికీ జాబితాలో చోటుదక్కలేదు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌లోని నారాయణపూర్‌ పోలీస్‌ ఠాణాకు 14వ ర్యాంక్‌ దక్కడమే కాస్త ఊరట. ఉత్తమ ఠాణాల ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ ఉండాలన్న లక్ష్యంతో అప్పటి సీపీ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి స్వయంగా పోలీస్‌ ఠాణాల్లో ప్రమాణాలను పర్యవేక్షించారు. అ‘ద్వితీయ’ంగా నిలిచేలా కృషి చేశారు. పంజాగుట్ట పోలీసుల ప్రతిభను స్వయంగా చూసేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్ర హోంశాఖ అధికారులు వచ్చారు. ఆ స్ఫూర్తితో తొలి ర్యాంక్‌ సాధించేలా ముందుకు వెళ్లాలి. ఇందుకు భిన్నంగా పరిస్థితి మారిపోయింది.

రెండూ ఘనమే...
ఉత్తమ పోలీస్‌ఠాణా పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా నేర నియంత్రణ, కేసుల పరిష్కారాన్ని ప్రామాణికాలుగా నిర్దేశించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో పంజాగుట్టతో పాటు జూబ్లీహిల్స్‌, మలక్‌పేట, ఓయూ, సుల్తాబజార్‌ పోలీస్‌ఠాణాలు ఉత్తమ పోలీస్‌ఠాణాగా గుర్తింపు తెచ్చుకునేందుకు పోటీపడ్డాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్‌ ఠాణాలను అత్యాధునికంగా రూపొందించడంతో ఇవి పోటీకి సిద్ధమయ్యాయి. ఉత్తమ ఠాణాగా ఎంపిక కావాలంటే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రివేళల్లో నేరాలను నియంత్రించడం, రౌడీషీటర్లు, దొంగలను పట్టుకోవడం కోసం అదనంగా విధులు నిర్వహించాలి. నేరాలు తగ్గించడంలో భాగంగా పరారీలో ఉన్న నేరస్థులకు తాఖీదులు జారీ చేయడం, హత్యకేసుల్లో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ పోలీస్‌ ఠాణాల పరిధుల్లో నేరాలు తగ్గించేందుకు కృషి చేయడం ఇన్‌స్పెక్టర్ల విధి. ఇలాంటివి ఆయా పోలీస్‌ ఠాణాల్లో జరుగుతున్నా... అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా, దేశంలోని ఇతర పోలీస్‌ ఠాణాలకన్నా మెరుగ్గా లేకపోవడంతో దేశవ్యాప్త ర్యాంకుల జాబితాలో ఆయా ఠాణాల పేర్లు కనిపించలేదు.

ప్రమాణాలు.. హంగులున్నా...
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో పోలీస్‌ఠాణాలు కార్పొరేట్‌ కార్యాలయాల్లా మారిపోయాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం... పోలీస్‌ఠాణా లోపల... వెలుపల పచ్చదనం... ఠాణాకు రాగానే ఫిర్యాదిదారులకు భరోసా కలిగే వాతావరణాన్ని పోలీస్‌శాఖ కల్పించింది. బాధితులు పోలీస్‌ ఠాణాలోకి అడుగుపెట్టగానే... సురక్షిత ప్రాంతానికి వచ్చామన్న భావనను కలిగించడంతో పాటు వారితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఆతిథ్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆతిథ్యకేంద్రం దగ్గర ఫిర్యాదుదారులు చెప్పే మాటలను, వారి ఆవేదనను వినేందుకు పోలీసులు సిద్ధంగా ఉంటారు. తమ సమస్యను చెప్పుకొనేందుకు వచ్చినవారిలో నిరక్షరాస్యులుంటే వారు వివరించిన సమస్యను పోలీసులే ఫిర్యాదుగా రాస్తారు. ఫిర్యాదును వారికి వినిపించి, అంగీకరించాకే తదుపరి చర్యలు చేపడుతున్నారు. మరి ఇన్ని ప్రమాణాలు పాటిస్తున్నా.. హంగులున్నా... ర్యాంకు రాలేదంటే ఆలోచించాల్సిందే. ర్యాంకులొచ్చిన పోలీస్‌ ఠాణాల ప్రమాణాలను సరిపోల్చుకుని అంతకన్నా ఎక్కువ మార్కులొచ్చేలా పోలీస్‌ అధికారులు కృషి చేయాలి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు