close

గ్రేటర్‌ హైదరాబాద్‌

తాత్కాలిక సచివాలయంలో విధుల నిర్వహణ

బీఆర్‌కే భవన్‌కు మరికొన్ని శాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ తాత్కాలిక సచివాలయమైన బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్‌ నుంచి మంగళవారం మరికొన్ని శాఖల ఉన్నతాధికారులు విధులు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉదయమే వచ్చి తన పేషీలో దస్త్రాలను పరిశీలించి వెళ్లారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అథర్‌ సిన్హా, వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి కూడా వచ్చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి బాధ్యతలు చేపట్టారు. సచివాలయం తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తమ శాఖల దస్త్రాలు, సామగ్రి తరలింపు పనులను సంబంధిత ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. బీఆర్‌కే భవన్‌లో పలు సమావేశ మందిరాలను సిద్ధంచేస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి రాకపోకలు పెరగడంతో, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యల్లో పోలీసులు నిమగ్నులయ్యారు.రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కార్యాలయం సచివాలయం నుంచి బొగ్గులకుంటకు మారింది. కొత్త భవనాల నిర్మాణంలో భాగంగా, సచివాలయం నుంచి వివిధ కార్యాలయాలను ప్రభుత్వం వేరే చోట్లకు తరలిస్తుండటం తెలిసిందే. బొగ్గులకుంటలో కమిషనర్‌ ఉండే భవనంలోకి తన కార్యాలయాన్ని మార్చిన ఆయన, మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఇప్పటివరకు సచివాలయంలో ఉన్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాలను సైతం మార్చారు. హైదరాబాద్‌-1, 2 విజిలెన్స్‌ ఆఫీసులు బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధకశాఖ కార్యాలయంలోకి మారాయి. విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లోని ఏపీ డీజీపీ ఆఫీసు భవనంలోకి మారింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు