close

బిజినెస్‌

కారు కొనేవాళ్లూ క్యాబ్‌ ఎక్కుతున్నారు

నెలవారీ వాయిదాలపై యువత విముఖత
వాహన మందగమనానికి ఇదీ కారణమే
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రస్తుత వాహన రంగం మందగమనానికి చాలా కారణాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆలోచనా ధోరణి మారిందని, సొంతంగా కారు కొనుగోలు చేసి, నెలవారీ చెల్లింపులు చేయడానికి బదులు ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌లు, మెట్రో సేవలకు మొగ్గుచూపుతున్నారని అన్నారు. గత రెండేళ్లలో వాహన పరిశ్రమ మెరుగ్గా రాణించిందని, అమ్మకాలు సైతం బాగా నమోదయ్యాయని అభిప్రాయపడ్డారు. బీఎస్‌-6 ప్రమాణాలకు మారడం, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆంశాలు, యువత ధోరణి మారడం వంటి వాహన పరిశ్రమపై ప్రభావం చూపాయని తెలిపారు. వాహన పరిశ్రమపై అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయని, సమస్యను గుర్తించామని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. బీఎస్‌-6 ప్రమాణాలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం బీఎస్‌-4 ఉద్గార నిబంధనలు అమలవుతున్నాయి.

రెండేళ్లలోపు 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం: వచ్చే రెండేళ్లలోపు 1.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ 100 రోజుల పాలన గురించి చెన్నై గిండిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు