close

బిజినెస్‌

ఖాతాదార్లకు ప్రత్యేక అత్యవసర రుణాలు

ముందుకొచ్చిన బ్యాంకులు

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలతో ప్రజలు, వ్యాపారాలపై పడుతున్న ప్రభావం నుంచి ఖాతాదారులను రక్షించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. వారికి ప్రత్యేక అత్యవసర రుణాలను అందించడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ఇండియన్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉన్నాయి. ప్రత్యేక అత్యవసర రుణ ఉత్పత్తుల్ని బుధవారం ఈ బ్యాంకులు ప్రకటించాయి. వీటితో పాటు కెనరా బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లు కూడా ఖాతాదారులకు అత్యవసర రుణ సదుపాయం కల్పించనున్నాయి. ‘సవాళ్లతో కూడిన ప్రస్తుత తరుణంలో ఖాతాదారుల పక్షాన నిలిచేందుకు బ్యాంక్‌ సిద్ధంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో చాలా రంగాలు కష్టాలు ఎదుర్కొంటున్నందున వ్యాపారాలకు, రిటైల్‌ ఖాతాదార్లకు ద్రవ్య లభ్యత సమస్యలు రాకుండా రుణ ఉత్పత్తుల్ని ప్రారంభించామ’ని ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మజా చుండూరు వెల్లడించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా కొవిడ్‌ ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (సీఈఎల్‌సీ)ని ప్రారంభించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా రుణ గ్రహీతలకు అత్యవసర రుణాలను ప్రకటించింది. తమ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ ఖాతాదారులు, కార్పొరేట్‌ రుణ గ్రహీతలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ అందించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా సిద్ధమైంది. గత వారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కూడా తమ రుణ గ్రహీతలకు అదనపు నిధుల్ని అందజేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇదే దారిలో వెళుతోంది. కెనరా బ్యాంక్‌ కూడా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ/కార్పొరేట్‌/బిజినెస్‌/అగ్రి/రిటైల్‌ ఖాతాదారులకు ప్రత్యేక రుణ పథకాలను అందించనుంది. కొవిడ్‌-19 లైన్‌ ఆఫ్‌ సపోర్ట్‌ పథకాన్ని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ప్రారంభించింది. మరిన్ని బ్యాంకులు కూడా ఈ ప్రత్యేక అత్యవసర రుణ పథకాలతో ముందుకొచ్చే అవకాశాలున్నాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు