close

తాజా వార్తలు

ఎంజే అక్బర్‌పై మహిళా నెటిజన్ల విమర్శలు

పేరు ముందు ‘చౌకీదార్‌’ అని చేర్చుకోవడంపై

దిల్లీ: ‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి ఎం.జే అక్బర్‌ మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలకు గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ‘మైన్‌ భీ చౌకీదార్‌‘(నేను కాపలాదారుణ్ని) అనే ఉద్యమాన్ని ట్విటర్‌ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధాని బాటలో స్మృతి ఇరానీ, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ వంటి భాజపా సీనియర్లు సైతం వారి పేర్లముందు చౌకీదార్‌ అని చేర్చుకున్నారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ కూడా చౌకీదార్‌ అనే పదాన్ని జోడించుకున్నారు.

‘మైన్‌ భీ చౌకీదార్‌’ ఉద్యమంలో నేను కూడా భాగమైనందుకు గర్వంగా ఉంది. భారత పౌరుడిగా అవినీతిని, ఉగ్రవాదాన్ని, పేదరికాన్ని నిర్మూలించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. బలమైన నూతన భారతాన్ని సృష్టిస్తాను’ అని ట్వీట్‌ చేశారు. దీంతో అక్బర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

‘ఎంజే అక్బర్‌ తానో కాపలాదారుడినని అనుకుంటున్నారు. ఆయనకిది సరిపోదు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు గౌరవం ఇవ్వండి చాలు’ అని శిల్పి తివారి అనే సామాజిక కార్యకర్త ట్వీట్‌ చేశారు. ‘మీరు కాపలాదారుగా మారితే దేశంలో మహిళలు భయపడుతూ ఉండాల్సి వస్తుంది. ఇక వారిని దేవుడే కాపాడాలి’అంటూ అని నెటిజన్లు తీవ్రస్థాయిలో అక్బర్‌ మీద విమర్శలు గుప్పించారు. వీరిలో మహిళా నెటిజన్లే ఎక్కువ ఉండటం గమనార్హం. దీంతో అక్బర్‌ చౌకీదార్‌ అనే పదాన్ని తీసేశారు. కొంత సేపటి తర్వాత మళ్లీ ఈ పదాన్ని చేర్చుకున్నారు.

అక్బర్‌ ఓ పత్రికకు ఎడిటర్‌గా ఉన్నప్పుడు తమను లైంగిక వేధింపులకు గురి చేశారని కొందరు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ విషయం కాస్తా రాజకీయ దుమారానికి దారి తీసింది. దీంతో అక్బర్‌ తన కేంద్రమంత్రి పదవికి గతేడాది అక్టోబరులో రాజీనామా చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు