close

ఆంధ్రప్రదేశ్

వినయ విధేయ అభ్యర్థి

సమన్వయకర్తలకే పెద్దపీట
కొత్తగా వచ్చిన వారిలో కొద్ది మందికీ...
అభ్యర్థులుగా ముగ్గురు ఎమ్మెల్సీలు
సిట్టింగుల్లో 40 మందికి చోటు
నలుగురు ఎమ్మెల్యేలకు దక్కని సీట్లు
  ఒకేసారి 175 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
ఎంపీ అభ్యర్థుల ఎంపికా పూర్తి
ఈనాడు - అమరావతి

జగన్‌ పాదయాత్ర సమయంలో నియమితులైన నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తల్లో అత్యధికులకు వైకాపా టికెట్లిచ్చింది. 40 మంది సిట్టింగు ఎమ్మెల్యేలు టికెట్లు దక్కించుకోగా నలుగురిని పక్కనబెట్టింది. కొత్తగా వచ్చిన వారిలో కొంత మందికి టికెట్లు దక్కాయి. ఇలా వచ్చి అలా టికెట్‌ దక్కించుకున్నవారూ ఉన్నారు. ఆదివారం ఇడుపులపాయలో 175 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లనూ వైకాపా ప్రకటించింది. 25 మంది ఎంపీ అభ్యర్థుల ఎంపికనూ ఆదివారంతో పూర్తి చేసింది. వైకాపా జాబితాలోని విశేషాలివీ...

గత ఎన్నికల్లో మైనారిటీల్లో నలుగురికి టికెట్‌ ఇవ్వగా ఈసారి అయిదుగురికి అవకాశమిచ్చారు. ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్సీలకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం (ఆళ్ల నానికి ఏలూరు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు మండపేట, కోలగట్ల వీరభద్రస్వామికి విజయనగరం) కల్పించారు. తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్‌కు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించారు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన రెడ్డి శాంతి ఈసారి పాతపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గానికి వెంకట సత్యవతి పేరును జగన్‌ ప్రకటించారు. ఆమె 2014లోనూ, తాజాగానూ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలంటూ తెదేపాలో తీవ్రంగా ప్రయత్నించారు. అక్కడ స్పష్టత రాలేదు. ఆదివారం నర్సీపట్నంలో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచార తొలి సభలో వెంకట సత్యవతిని అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా జగన్‌ ప్రకటించారు. దీంతో ముందే టికెట్‌ ఖరారు చేసుకుని ఆమె పార్టీలోకొచ్చినట్లైంది.

పార్టీలో చేరిన 24 గంటల్లోనే అభ్యర్థిత్వం
శనివారం పలువురు నేతలు వైకాపాలో చేరారు. వారిలో కొంత మంది ఆదివారం వైకాపా ప్రకటించిన జాబితాలో అవకాశం దక్కించుకోగలిగారు. వారిలో..
ఆదాల ప్రభాకర్‌రెడ్డి: నెల్లూరు (లోక్‌సభ)
వంగా గీత: కాకినాడ (లోక్‌సభ)
బల్లి దుర్గాప్రసాద్‌: తిరుపతి (లోక్‌సభ)
మాగుంట శ్రీనివాసులురెడ్డి: ఒంగోలు (లోక్‌సభ)
ద్రోణంరాజు శ్రీనివాస్‌: విశాఖ దక్షిణ (అసెంబ్లీ)

చివర్లో వచ్చి టికెట్‌ పొందినవారు

గత రెండు మూడు వారాల నుంచి వైకాపాలో చేరిన వారిలో కొంత మంది టికెట్లు పొందారు. వీరిలో...
* పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ): విజయవాడ లోక్‌సభ
* మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు: పర్చూరు (వాస్తవానికి ఈ సీటును ఆయన తనయుడు దగ్గుబాటి హితేష్‌కు ఖరారు చేయించుకున్నారు. హితేష్‌ పౌరసత్వ సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరి నిమిషంలో వెంకటేశ్వరరావుకు ఖరారు చేశారు)
* రఘురామ కృష్ణంరాజు: నరసాపురం లోక్‌సభ స్థానం (గతంలో వైకాపా నుంచే తెదేపాలోకి వెళ్లి మళ్లీ వైకాపాలోకి వచ్చారు)
* తోట వాణి: పెద్దాపురం (తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి గతవారమే వైకాపాలో చేరారు)
* మోదుగుల వేణుగోపాలరెడ్డి: గుంటూరు లోక్‌సభ (తెదేపా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరారు)
* ఉండవల్లి శ్రీదేవి: తాడికొండ (ఇప్పటివరకూ పార్టీ సమన్వయకర్తగా  ఉన్న క్రిస్టినా స్థానంలో కొత్తగా వచ్చిన ఈమెకు టికెట్టిచ్చారు)

టికెట్‌ కోసం చేరినా...

అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు తెదేపాకు రాజీనామా చేసి వైకాపాలో చేరారు. అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని కోరినా ఆయనకు  దక్కలేదు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆమెకూ టికెట్‌ దక్కలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావు, పారిశ్రామిక వేత్త దాసరి జైరమేశ్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు దాడి రత్నాకర్‌, ఎంఎంఆర్‌ గ్రూపు సంస్థల అధిపతి మధుసూదనరావులకూ వైకాపాలో చేరినా టికెట్లు దక్కలేదు.

లోక్‌సభ బరిలో అత్యధికం కొత్తవారే

కడప, రాజంపేటలలో మినహాయిస్తే మిగిలిన లోక్‌సభ స్థానాల్లో అందరూ కొత్తవారే.. వీరిలో బాలశౌరి గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయగా ఇప్పుడు మచిలీపట్నం నుంచి బరిలో దిగుతున్నారు. జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి, జగన్‌కు మొదటి నుంచీ చేదోడువాదోడుగా ఉంటున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డిలకు ఈసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఒంగోలులో వైవీ స్థానంలో మాగుంట శ్రీనివాసులురెడ్డికి, నెల్లూరులో మేకపాటి స్థానంలో ఆదాల ప్రభాకరరెడ్డికి టికెట్లు దక్కాయి. అనకాపల్లిలో వరుదు కళ్యాణి పార్టీ సమన్వయకర్తగా ఉండేవారు. ఆదివారం హఠాత్తుగా అక్కడ వెంకట సత్యవతి పేరును జగన్‌ ప్రకటించారు. విజయనగరం సీటు బొత్స కుటుంబానికే వస్తుందనుకున్నారు, అయితే సమన్వయకర్తగా ఉన్న బెల్లాని చంద్రశేఖర్‌నే ఖరారు చేశారు. కిల్లి కృపారాణిని శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బరిలో దించేందుకు వైకాపా అధినాయకత్వం ప్రయత్నించినప్పటికీ ఆమె టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీకి ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌నే అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ లోక్‌సభ స్థానంలో టికెట్‌ ఆశించి పార్టీలో చేరిన దాసరి జైరమేశ్‌కు అవకాశం దక్కలేదు. పీవీపీని పార్టీలో చేర్చుకున్న వైకాపా అధినాయకత్వం విజయవాడ టికెట్‌ను ఖరారు చేసింది. కర్నూలులో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ సీటును అక్కడ పార్టీ సమన్వయకర్తగా ఉన్న బీవై రామయ్య ఆశించారు. అయితే కొద్దిరోజుల కిందట సంజీవ్‌కుమార్‌ పేరును తెరపైకి తీసుకొచ్చిన అధినాయకత్వం ఆయనకే టికెటిచ్చింది. తొలుత గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో పని చేసిన లావు కృష్ణదేవరాయలును నరసరావుపేటకు మార్చింది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మధ్యలో తెదేపాలోకి వెళ్లారు. ఆమె తిరిగి వైకాపాలోకి వచ్చారు. ఆమెకూ ఈసారి అవకాశం దక్కలేదు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు