close

ఆంధ్రప్రదేశ్

సభాపతి కోడెలపై దాడి

ఇనిమెట్లలో వైకాపా కార్యకర్తల దాష్టీకం
గంటసేపు పోలింగు కేంద్రంలో నిర్బంధం
నలుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలు
2 గంటల పాటు పోలింగ్‌కు అంతరాయం
సకాలంలో స్పందించని పోలీసులు
ఇనిమెట్ల(రాజుపాలెం) - న్యూస్‌టుడే

త్తెనపల్లి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడి బీభత్సం సృష్టించారు. రాజుపాలెం నియోజకవర్గంలో పర్యటిస్తున్న కోడెలకు ఇనిమెట్లలో రిగ్గింగ్‌ జరుగుతోందన్న సమాచారం అందింది. దీనితో ఆయన పదకొండు గంటల సమయంలో  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 160వ పోలింగ్‌ బూత్‌కి వచ్చారు. అదే సమయంలో ఓటు వేసేందుకు వచ్చిన వైకాపా శ్రేణులు కోడెలతో వాగ్విదానికి దిగాయి. ఆయన బూత్‌ లోపలకి రావటంపై అభ్యంతరం తెలిపాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు లోపలికి రావచ్చంటూ కోడెల సమాధానం ఇచ్చారు. ఈలోపు విషయం తెలిసి భారీగా వైకాపాశ్రేణులు అక్కడకు రావటంతో పోలింగు సిబ్బంది గది తలుపులు మూసివేశారు. పోలింగ్‌ పక్రియ నిలిచిపోయింది. కోడెల బయటకు రానీయకుండా పోలింగ్‌ బూత్‌లోనే గంట సేపు నిర్బంధించారు. వైకాపా కార్యకర్తలు దౌర్జన్యంగా తలుపులు తోసుకుని లోపలకివెళ్లి కుర్చీలో ఉన్న కోడెలపై పిడిగుద్దులతో దాడి చేశారు. ఆయన చొక్కాచిరిగి కిందపడిపోయారు. అప్రమత్తమైన కోడెల భద్రతాసిబ్బంది వైకాపా కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ కాలేషావలి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని కోడెలను కేంద్రం నుంచి బయటకు తీసుకువస్తూండగా వైకాపా వారు మళ్లీ అడ్డుకున్నారు. రాళ్లు, ఇసుక, మట్టి ఏది అందుబాటులోఉంటే వాటితో దాడిచేశారు. ఈ దాడిలో కోడెల కారు అద్దాలు ధ్వంసం కాగా నలుగురుతెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఉద్రిక్తపరిస్థితులు నెలకొనటంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు నామమాత్రంగా ఉండటం, డీఎస్పీకి సమాచారం ఇచ్చినా అదనపు బలగాలు లేకుండా రావటంతో వైకాపా కార్యకర్తలు చెలరేగిపోయారన్న విమర్శలు వచ్చాయి.  సంఘటనను చిత్రీకరించేందుకు వెళ్లిన ఈనాడు-ఈటీవి విలేకరి విజయ్‌కుమార్‌పైనా వైకాపా శ్రేణులు విరుచుకుపడ్డారు. అతనిపై దాడి చేసి, కెమెరా, చరవాణి, మైకులను లాక్కొని ధ్వంసం చేశారు.

నకరికల్లులోనూ..: ఇనిమెట్ల నుంచి నుంచి నేరుగా సభాపతి నకరికల్లు జడ్పీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. వైకాపా శ్రేణులు ఆయన వాహనానికి అడ్డుతగిలి ‘కోడెల గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. వాహనాన్ని లోపలకి రాకుండా అడ్డు నిలిచారు. దీంతో తెదేపా వర్గీయులు వారికి దీటుగా బదులివ్వడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఉద్రిక్తత నడుమ కోడెల కారు దిగకుండానే బయటికి వెళ్లిపోయారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే ప్రథమం
దాడి జరిగిన అనంతరం శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ‘ఈనాడు-ఈటీవీతో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ఇది దుర్మార్గం. దౌర్జన్యం, హింసకు పాల్పడి గెలుపొందాలనుకుంటున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే సామాన్యులకు రక్షణ ఉండదు. నా పైనే దాడికి పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి.’’ అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోనే సుమారు 50 ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయలేదని, దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఆరోపించారు. ఒకవైపు వైకాపా, మరోవైపు ఎన్నికల సంఘం తెదేపాను ఇబ్బంది పెడుతోందని అంతిమంగా ప్రజలే తమ ఓటుతో సరైన తీర్పును ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు