close

ఆంధ్రప్రదేశ్

ఓటమి భయంతోనే వదంతుల వ్యాప్తి

విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ
అవి మనుగడ సాగించలేవని వ్యాఖ్య

భాగల్‌పుర్‌/సిల్చార్‌: ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకొందని, అందుకే ప్రజల్లో భీతికలిగేలా వదంతులను వ్యాప్తి చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గురువారం బిహార్‌లోని భాగల్‌పుర్‌, అసోంలోని సిల్చార్‌, కెందుక్కోనల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అవినీతి దుకాణాలు మూతపడుతాయని వారు భయపడుతున్నారు. వారసత్వ రాజకీయాలు, లంచాలు తీసుకొని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరగవని వణుకుతున్నారు. అందుకే... మళ్లీ మోదీ వస్తే అసలు ఎన్నికలే జరగవని అంటున్నారు. రాజ్యాంగ సంస్థలకు ముప్పువాటిల్లుతుందని చెబుతున్నారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే ‘ఈ చౌకీదార్‌’ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్ల విధానాన్ని పటిష్ఠపరుస్తున్నారు. ఏ వర్గానికీ నష్టం కలిగించకుండా, సాంఘిక అశాంతికి తావులేకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాం’’ అని వివరించారు. మొదటి దశ పోలింగ్‌లో తమకు అనుకూలంగా పవనాలు వీస్తున్నట్టు సమాచారం అందిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అక్రమ వలసలను ప్రోత్సహించిందన్నారు. వారసత్వంగల ఓ కుటుంబానికి అవినీతే జీవన విధానంగా మారిందని, వారే ఇప్పుడు ‘చౌకీదార్‌’ను దొంగ అని అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో వీఐపీల వాహనాలకు ఎర్రలైట్లు ఉంటే తాము వాటిని తొలగించి, పేదల ఇళ్లల్లో వెలుగులు నింపామని చెప్పారు. వారు విలాసవంతమైన భవనాలను నిర్మించుకుంటే తాము పేదలకు ఇళ్లు, వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు మేలు చేసే ముమ్మారు తలాక్‌ నిషేధం బిల్లును తీసుకొస్తామన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు