close

ఆంధ్రప్రదేశ్

ఓటు స్ఫూర్తిని నింపారు.. మృత్యుఒడికి చేరారు

రాష్ట్రవ్యాప్తంగా 8 మంది కన్నుమూత

న్యూస్‌టుడే యంత్రాంగం: వృద్ధాప్యంలోనూ సడలని ఆత్మవిశ్వాసంతో యువ ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచి ఓటేసిన వృద్ధులు తిరిగి తమతమ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో సొమ్మసిల్లి మృత్యువాత పడిన ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి.
* కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం మోగులూరులో బోజెడ్ల లీలావతి (63) బంధువుల సాయంతో ఓటు వేశారు. అనంతరం పోలింగ్‌ బూత్‌లోనే సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు.
* పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో బండారు ముసలయ్య (80) కుమారుడి సాయంతో ఉదయం పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఇంటికి వస్తుండగా కుప్పకూలి అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చికిత్స అందించేందుకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
* చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముత్తుకూరులో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన ఎం.మొగిలమ్మ (85) వడదెబ్బకు గురై ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందింది.
* గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడికి చెందిన దేవరకొండ ప్రసాద్‌(75) ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి తన కుమారుడి సాయంతో చేరుకున్నాడు. పోలింగ్‌ కేంద్రం లోపల ప్రసాద్‌ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అమరావతి వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు.
* కర్నూలు జిల్లా మిడుతూరు మండలం దేవనూరుకు చెందిన పెద్ద కరీమాఖాతూన్‌ (69) ఓటు వేసేందుకు వెళ్తూ పోలింగ్‌ కేంద్రం సమీపంలోనే కుప్పకూలి మృతి చెందింది.
* తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం కేఈచిన్నాయిపాలెంలో శీరం మాణిక్యం (64) ఓటువేయడానికి వెళ్లి వరుసలో ఉండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందింది.
* అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన ఉలవల నరసింహుడు (48) పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటువేసి ఇంటికి తిరిగివచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురవటంతో ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఓటేసిన పది నిమిషాలకే..
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామానికి చెందిన తెదేపా సీనియర్‌ నాయకుడు బొబ్బిలి నారాయణరెడ్డి (65) ఓటుహక్కు వినియోగించుకొన్న 10 నిమిషాలకే మృతిచెందారు. ఇతను కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఓటుహక్కు వినియోగించుకొని ఇంటికి బయలుదేరగా గుండెపోటు వచ్చి చనిపోయారు. విషయం తెలుసుకున్న తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్‌ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు