2021-22లో వృద్ధి 7 శాతమే - Growth is 20 percent in 2021-22
close

Published : 31/03/2021 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021-22లో వృద్ధి 7 శాతమే

 ఉత్పత్తి 2019 స్థాయి కంటే తక్కువగానే
 భారత్‌పై ఐక్యరాజ్యసమితి అంచనా

దిల్లీ: కొవిడ్‌-19 టీకా వచ్చినప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల ఉత్పత్తి 2019 స్థాయిల కంటే తక్కువగానే ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2021-22లో వృద్ధి 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ‘ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ సర్వే ఆఫ్‌ ఆసియా అండ్‌ ద పసిఫిక్‌- 2021’ నివేదికలో పేర్కొంది. కొవిడ్‌-19 పరిణామాలు సాధారణ వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపడంతో 2020-21లో వృద్ధి -7.7 శాతంగా నమోదుకావచ్చని తెలిపింది. ‘జీడీపీ, పెట్టుబడులు స్తబ్దుగా ఉన్న సమయంలో దేశంలో కరోనా ప్రభావం మొదలైంది. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. దీంతో 2020 రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింద’ని నివేదిక అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌ సడలింపులు, కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖంతో మూడో త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో వృద్ధి నెమ్మదించినప్పటికీ.. ఏడాది ప్రాతిపదికన చూస్తే వృద్ధి సున్నా స్థాయికి సమీపానికి చేరిందని అంచనా వేసింది. ‘కొవిడ్‌-19 కొత్త కేసుల సంఖ్య తగ్గడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం లాంటి సానుకూలతలు ఉన్నప్పటికీ 2021లో ఆర్థిక కార్యకలాపాల ఉత్పత్తి 2019 స్థాయి కంటే తక్కువగానే ఉండొచ్చ’ని అంచనా వేసింది. 2020-21లో భారత్‌ వృద్ధి -8 శాతంగా ఉండే అవకాశం ఉందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తన రెండో ముందస్తు అంచనాల్లో వెల్లడించిన విషయం విదితమే. అయితే 2020లో సానుకూల (ప్లస్‌) వార్షిక వృద్ధి రేటును నమోదు చేయనున్న ఒకే ఒక్క దిగ్గజ ఆర్థిక వ్యవస్థగా చైనా నిలిచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ఆసియా- పసిఫిక్‌ ప్రాంతంలోని వర్థమాన దేశాల సగటు వృద్ధి రేటు ప్రస్తుత సంవత్సరంలో 5.9 శాతంగాను, వచే ఏడాది 5 శాతంగాను నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. 2020లో ఇది -1 శాతంగా ఉంది.


ఆందోళనకరంగానే ద్రవ్యోల్బణం
 ఆజ్యం పోస్తున్న చమురు, ఆహార పదార్థాల ధరలు: మూడీస్‌

దిల్లీ: భారత్‌లో ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో చాలా ఎక్కువగా ఉందని మూడీస్‌ అనలిటిక్స్‌ అభిప్రాయపడింది. ఆహార పదార్థాల ధరల్లో ఒడుదొడుకులు, అధిక ఇంధన ధరలు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణాలని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో కీలక రేట్ల కోత జోలికి ఆర్‌బీఐ వెళ్లకపోవచ్చని అంచనా వేసింది. జనవరిలో 4.1 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5 శాతానికి చేరింది. పరపతి విధాన నిర్ణయాలను తీసుకునే ముందు ఆర్‌బీఐ రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటుందనే విషయం విదితమే.
ఆసియాలో ఆ రెండు దేశాలే..
ఆసియాలో ఫిలిప్ఫిన్స్‌, భారత్‌లోనే ద్రవ్యోల్బణం ఎక్కువగా కన్పిస్తోందని, మిగిలిన చాలా దేశాల్లో స్తబ్దుగానే ఉందని మూడీస్‌ పేర్కొంది. చమురు ధరల వల్లే ప్రస్తుత సంవత్సరంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 2021లో ఇప్పటివరకు బ్యారల్‌ బ్రెంట్‌ ధర 26 శాతం పెరిగి 64 డాలర్ల వద్ద కదలాడుతోంది. 2020 మార్చిలో ఇది 30 డాలర్లుగా ఉంది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 (+/-2 శాతం) శాతం లోపునకు పరిమితం చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎగువ స్థాయి అయిన 6 శాతానికి మించి ద్రవ్యోల్బణం నమోదుకావడం గతేడాదిలో పలుమార్లు జరిగింది. 2021 మార్చి 21లోగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయి లోపునకు ఆర్‌బీఐ తీసుకొచ్చే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని