ఆరోగ్య బీమా ప్రీమియం వాయిదాల్లో చెల్లించ‌వచ్చు - Health-insurance-premiums-in-instalments
close

Published : 26/12/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమా ప్రీమియం వాయిదాల్లో చెల్లించ‌వచ్చు

ఆరోగ్య బీమా నిబంధనల్లో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సవరణలు చేసింది. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారు ప్రీమియం మొత్తాన్ని వార్షికంగానేకాకుండా నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సర వాయిదాల విధానంలో చెల్లించేందుకు అనుమ‌తిస్తూ స‌ర్క్యులార్‌ను జారీ చేసింది.

దీంతోపాటు… ఇప్పటి వరకూ బీమా సంస్థలు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు గరిష్ఠంగా 65 ఏళ్ల వరకే అనుమతించేవి. ఆ తర్వాత పునరుద్ధరణకు జీవితాంతం వరకూ అవకాశం ఉంటుంది. '65 ఏళ్లు దాటిన వారు కొత్త పాలసీ తీసుకునేందుకు వీలుండేది కాదు. కొత్త సవరణ రావడం వల్ల… ఆ వయసు దాటిన వారికి కూడా కొత్త పాలసీలను ఇచ్చేందుకు వీలవుతుంది. ఇలా పాలసీని ఇచ్చేప్పుడు బీమా సంస్థలు నియంత్రణ సంస్థకు తెలియజేయడంతోపాటు, ఆయా మార్కెటింగ్‌ ఛానెళ్లకూ మార్పులు చేసిన సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆ పాలసీని అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పంపిణీ వ్యవస్థలకు తోడుగా నిర్ణీత పాలసీలను కొత్త మార్గాల్లో విక్రయించేందుకూ బీమా సంస్థలు ప్రయత్నాలు చేసుకోవచ్చని ఐఆర్‌డీఏ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. దీనికి ఐఆర్‌డీఏ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. తమ పాలసీల్లో వస్తున్న లాభ, నష్టాల నిష్పత్తికి తగ్గట్టుగా ప్రీమియంలో 15శాతం పెంచేందుకు లేదా తగ్గించుకునేందుకు బీమా సంస్థలకు అనుమతినిచ్చింది. పాలసీని విడుదల చేసి, ఇప్పటికే మూడేళ్లు పూర్తయినప్పుడే ప్రీమియం పెంచుకునేందుకు వీలవుతుంది. ప్రీమియం చెల్లించే వ్యవధిని మార్చినప్పటికీ… ఇప్పటికే అనుమతి పొందిన ప్రాథమిక ప్రీమియం రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండవని ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. వ్యవధి మార్చుకునే విషయంలో పారదర్శకత ఉండాలని పేర్కొంది.

బీమా సంస్థ‌లు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు ఆమోదించిన స్టాండ‌లోన్‌ రైడర్‌లను లేదా యాడ్-ఆన్‌లను కూడా జోడించవచ్చు. ఇప్పటికే ఉన్న పాలసీల్లో బీమా సంస్థ స్వల్ప మార్పులు, చేర్పులు చేసుకునేందుకూ వీలు కల్పించింది. కొత్త వ్యాధులకు వర్తించేలా పాలసీలో అదనంగా అవకాశం కల్పించినా… అందరికీ ఆ సమాచారం తెలియజేయాల్సి ఉంటుంది. ఐఆర్‌డీఏ చర్యతో బీమా కంపెనీలు మరింత సరళమైన వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు జారీ చేసేందుకు, తద్వారా ఆరోగ్య బీమా మరింతగా ప్రజల్లోకి విస్త‌రించేందుకు అవ‌కాశ‌ముంటుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని