అగ్ర స్థానం నుంచి ‘మా’యం..! - Jack Ma No longer chinas richest man
close

Updated : 03/03/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అగ్ర స్థానం నుంచి ‘మా’యం..!

చైనా కుబేరుల జాబితాలో వెనుకబడ్డ అలీబాబా అధినేత

బీజింగ్‌: చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి చిక్కుల్లో ఇరుక్కున్న అలీబాబా, యాంట్‌ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్‌ మా.. తాజాగా ఆ దేశ కుబేర స్థానాన్ని కోల్పోయారు. హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. చైనాలోని ధనవంతుల జాబితాలో ఆయన నాలుగో స్థానానికి పడిపోయారు. మరోవైపు ఆయన వ్యాపార ప్రత్యర్థులు మాత్రం భారీగా సంపదను పోగేశారు. ఆయన కంపెనీలపై చైనా ప్రభుత్వం గట్టి నిఘా పెట్టడమే జాక్‌ మా స్థానం దిగజారడానికి కారణంగా తెలుస్తోంది.

2019, 2020లో వరుసగా జాక్‌ మా, ఆయన కుటుంబం చైనా ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. ఈసారి ఆ స్థానానికి నాంగ్‌ఫూ స్ప్రింగ్‌ కంపెనీ అధిపతి జోంగ్‌ షాన్‌షాన్‌ చేరారు. తర్వాతి రెండు స్థానాల్లో టెన్సెంట్‌ హోల్డింగ్స్‌ పోనీ మా, ఈ-కామర్స్‌ పిన్‌డ్యువోడ్యువో అధిపతి కొలిన్‌ హువాంగ్‌ ఉన్నారు. జోంగ్‌ సంపద గత ఏడాది కాలంలో అనూహ్యంగా పెరిగి 85 బిలియన్‌ డాలర్లకు చేరగా.. టెన్సెంట్‌ మా సంపద ఏకంగా 70 శాతం ఎగబాకి 74.19 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక హువాంగ్‌ సంపద 283 శాతం పెరిగి 69.55 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. ఇక జాక్‌ మా, ఆయన కుటుంబ సంపద ఏడాది వ్యవధిలో 22 శాతం పెరిగి 55.64 బిలియన్‌ డాలర్లగా ఉంది. 

గతేడాది అక్టోబరు 24న చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపడంతో జాక్‌ మాపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ సీసీపీ అగ్రనాయకత్వం‌ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. అంతేగాక, 37 బిలియన్‌ డాలర్లు విలువచేసే యాంట్‌ గ్రూప్‌ ఐపీవోను అడ్డుకొంది. చైనా విడుదల చేసిన టెక్‌ దిగ్గజాల జాబితా నుంచి కూడా ఆయనను పక్కనబెట్టేశారు. ఈ పరిణామాల తర్వాత జాక్‌ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కన్పించకుండా పోయారు. దీంతో ఆయన అదృశ్యంపై పలు అనుమానాలు తలెత్తాయి. కానీ, కొద్ది వారాల తర్వాత వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కుబేరుల జాబితాలో తొలి స్థానాన్ని కూడా కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి...

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్‌షా

రూ.77,815 కోట్ల స్పెక్ట్రమ్‌ అమ్మకం
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని