పెరగనున్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం! ఎందుకంటే.. - Term policy premium rates May rise from FY22
close

Published : 13/03/2021 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరగనున్న టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం! ఎందుకంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంతో పాటు బీమాపై అవగాహన పెరిగింది. జీవితంలో బీమా ప్రాధాన్యం చాలా మందికి తెలిసొచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో టర్మ్‌ పాలసీ, సాధారణ జీవిత బీమా, ఆరోగ్య బీమాకు డిమాండ్‌ పెరిగింది. అయితే, ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం చాలా వరకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ప్రీమియం పెరగనుంది. ఇందుకు మహమ్మారి ఓ కారణం కాగా.. రీఇన్సూరెన్స్‌ సంస్థలు ప్రీమియం పెంచడం కూడా ప్రభావం చూపనుంది.

టర్మ్‌ పాలసీల ప్రీమియంలు రానున్న కొన్ని నెలల్లో 10-15 శాతం పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టాటా ఏఐఏ, ఎగన్‌ లైఫ్‌, మ్యాక్స్‌ లైఫ్‌, పీఎన్‌బీ మెట్‌లైఫ్‌, ఇండియాఫస్ట్‌ లైఫ్‌ వంటి సంస్థలు ప్రీమియం పెంచుతూ కొత్త పాలసీలను బీమా నియంత్రణా ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏకు సమర్పించినట్లు సమాచారం. ఇతర ప్రైవేట్‌ సంస్థలు సైతం ఇదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎల్‌ఐసీ నిర్ణయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఎల్‌ఐసీ ప్రీమియంలో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. దీంతో బీమా క్లెయిమ్‌లు పెరిగాయి. ఇది రీఇన్సూరెన్స్‌ కంపెనీలకు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఆర్థిక రక్షణ కల్పించే సంస్థలే రీఇన్సూరెన్స్‌ కంపెనీలు. అంటే ఇవి బీమా సంస్థలకే బీమా కల్పిస్తాయి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా వైపరీత్యం తలెత్తితే అది ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుంది. ఇతర ప్రాంతాల్లో వచ్చే ఆదాయంతో రీఇన్సూరెన్స్‌ కంపెనీలు నష్టాలను పూడ్చుకుంటాయి. కానీ, కొవిడ్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీంతో చాలా వరకు అంతర్జాతీయ రీఇన్సూరెన్స్‌ కంపెనీలు నష్టాలను మూటగట్టకున్నాయి. వాటిని పూడ్చుకునేందుకు అవి ప్రీమియంను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే స్విస్ రే అనే కంపెనీ ప్రీమియం పెంచనున్నట్లు ప్రకటించింది.  ఈ భారాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరగనున్నాయి.

బీమా సంస్థల మధ్య ఇటీవలి కాలంలో పోటీ పెరిగి ప్రీమియం రేట్‌లను భారీగా తగ్గించాయి. ఇది కూడా తాజా పెంపునకు మరో కారణం. తక్కువ ప్రీమియం వల్ల కొవిడ్‌ సమయంలో సంస్థలు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. దీంతో భవిష్యత్తు రిస్క్‌ను తగ్గించుకోవడానికి తిరిగి ప్రీమియంలను ప్రామాణిక స్థాయికి పెంచాలని సంస్థలు నిర్ణయించినట్లు సమాచారం.

ఇవీ చదవండి...

కొవిడ్‌ భయం..కొత్త పాలసీలు జూమ్‌

ప్చ్‌.. మళ్లీ నిరాశ


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని