మందులకు అనూహ్య గిరాకీ
close

Published : 09/05/2021 05:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మందులకు అనూహ్య గిరాకీ

ఏప్రిల్‌లో 51 శాతం పెరిగిన అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 విజృంభణ ఫలితంగా దేశీయంగా మందుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మందుల విక్రయ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత నెలలో రూ.15,600 కోట్ల విలువైన మందుల అమ్మకాలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలు రూ.10,330 కోట్లు మాత్రమే. దీంతో పోల్చి చూస్తే ఈ ఏడాది ఏప్రిల్‌ నెల అమ్మకాలు 51 శాతం అధికంగా ఉండటం గమనార్హం.  
ముఖ్యంగా యాంటీ-ఇన్ఫెక్టివ్స్‌ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. విటమిన్లు, నూట్రాసూటికల్స్‌ అమ్మకాలు సైతం బాగా పెరిగాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయని భావిస్తున్న జింక్‌, విటమిన్‌-సి ట్యాబ్లెట్లను ప్రజలు అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు కొవిడ్‌-19 బాధితులకు వైద్యులు సిఫార్సు చేస్తున్న పారాసెట్మాల్‌, అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, పెంటప్రజోల్‌, ఐవర్‌మెక్టిన్‌ లాంటి ఔషధాల అమ్మకాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి దేశీయంగా తుది ఔషధాలు (ఫార్ములేషన్లు) విక్రయిస్తున్న ఫార్మా కంపెనీలకు కలిసి వస్తోంది. ముఖ్యంగా సిప్లా, సన్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌, జేబీ కెమికల్స్‌, బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థలు దేశీయ మార్కెట్‌కు ఈ ఔషధాలను అందిస్తున్నాయి. అదే సమయంలో అబాట్‌, సనోఫి, ఫైజర్‌ ఇండియా కూడా అధిక అమ్మకాలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 బాధితులకు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తున్న ఫావిపిరవిర్‌, రెమ్‌డెసివిర్‌ ఔషధాలను డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, క్యాడిల్లా, గ్లెన్‌మార్క్‌ తయారు చేస్తున్నాయి. ఇటువంటిదే అయిన తొసిలిజుమ్యాబ్‌ ఔషధాన్ని సిప్లా దిగుమతి చేసుకొని విక్రయిస్తుండగా, బయోకాన్‌ సొంతంగా తయారు చేస్తోంది. తొలిసిజుమ్యాబ్‌కు ప్రత్నామ్నాయంగా సిఫార్సు చేస్తున్న బెవాసిజుమ్యాబ్‌ ఔషధాన్ని ఇంటాస్‌ ఫార్మా దేశీయంగా ఉత్పత్తి చేసి విక్రయిస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని