ప్రోటోటైప్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహన తయారీలో జేఎల్‌ఆర్‌
close

Updated : 16/06/2021 10:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రోటోటైప్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహన తయారీలో జేఎల్‌ఆర్‌

దిల్లీ: తన ఖరీదైన ఎస్‌యూవీ ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ కొత్త వెర్షన్‌ ఆధారంగా ప్రోటోటైప్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహనాన్ని (ఎఫ్‌సీఈవీ) అభివృద్ధి చేస్తున్నట్లు టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వెల్లడించింది. 2036 కల్లా శూన్య ఉద్గారాలు, 2039 కల్లా తమ ఉత్పత్తులు, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థలన్నింటిలో నికరంగా శూన్య కర్బన ఉద్గారాల స్థాయిని అందుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ‘కొత్త డిఫెండర్‌ ఎఫ్‌సీఈవీ’ని అభివృద్ధి చేస్తున్నట్లు జేఎల్‌ఆర్‌ తెలిపింది. ‘ప్రాజెక్ట్‌ జ్యూస్‌’గా వ్యవహరిస్తున్న అధునాతన ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్‌ కింద దీనిని చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిన అడ్వాన్స్‌డ్‌ ప్రొపల్షన్‌ సెంటర్‌ కొంత మేర నిధులు వెచ్చిస్తోంది. ‘ప్రాజెక్టు జ్యూస్‌లో భాగంగా ప్రోటోటైప్‌ ఎఫ్‌సీఈవీ పరిశోధన, అభివృద్ధి, రూపకల్పన నిమిత్తం యూకే బ్యాటరీ ఇండస్ట్రిలైజేషన్‌ సెంటర్‌, మారెల్లి ఆటోమేటివ్‌ సిస్టమ్స్‌, డెల్టా మోటాôస్పోర్ట్‌ సహా వివిధ ప్రపంచ శ్రేణి ఆర్‌అండ్‌డీ భాగస్వాములతో జట్టు కట్టామ’ని జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వివరించింది.


డబ్ల్యూపీఐ ప్రామాణిక సంవత్సరం 2017-18కు!
డీపీఐఐటీ ముసాయిదా పత్రం జారీ

దిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సూచీ ప్రామాణిక సంవత్సరాన్ని 2011-12 నుంచి 2017-18కు మార్చేందుకు ముసాయిదా పత్రాన్ని డీపీఐఐటీ జారీ చేసింది. ఈ జాబితాలో ఔషధ మొక్కలు, పెన్‌ డ్రైవ్‌, లిఫ్ట్‌లు, జిమ్‌ పరికరాలు, కొన్ని రకాల మోటార్‌సైకిల్‌ ఇంజిన్‌లు వంటి 480 కొత్త వస్తువులను చేర్చాలని ప్రతిపాదించింది. దేశంలో ధరల వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రామాణిక సంవత్సర మార్పు దోహదపడుతుందని నివేదిక అభిప్రాయపడింది. వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, సంప్రదింపుల కోసం ముసాయిదా నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం డబ్ల్యూపీఐ సూచీలో మొత్తం 697 వస్తువులు ఉన్నాయి. ప్రాథమిక వస్తువులు (117), ఇంధనం- విద్యుత్‌ (16), తయారీ వస్తువులు (564)లకు ఇందులో ప్రాతినిధ్యం ఉంది. కొత్త సిరీస్‌లో 1176 వస్తువులను ప్రతిపాదించారు.  ప్రాథమిక వస్తువులు (131), ఇంధనం- విద్యుత్‌ (19), తయారీ వస్తువులు (1026)లకు ఇందులో ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉంది.


రత్నాభరణాల ఎగుమతులు 5% తగ్గాయ్‌
జీజేఈపీసీ

ముంబయి: దేశంలో కొవిడ్‌ రెండో దశ సృష్టించిన అవాంతరాల కారణంగా మేలో రత్నాభరణాల ఎగుమతులు 5 శాతం తగ్గి రూ.21,188 కోట్ల (2.89 బిలియన్‌ డాలర్లు)కు పరిమితం అయ్యాయని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. 2019 మేలో రత్నాభరణాల ఎగుమతులు రూ.22,388 కోట్లు (3.20 బిలియన్‌ డాలర్లు)గా నమోదయ్యాయి.  పలు రాష్ట్రాలు విధించిన పాక్షిక, పూర్తి లాక్‌డౌన్‌లతో సంస్థల సామర్థ్యాల వినియోగంపై పరిమితులు ఏర్పడటమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే 2019 ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో జరిగిన రత్నాభరణాల ఎగుమతుల విలువ 4 శాతం వృద్ధితో రూ.46,414.38 కోట్ల (6.31 బిలియన్‌ డాలర్లు)కు చేరాయి. ఏప్రిల్‌-మేలో ఎగుమతులకు డొమెస్టిక్‌ టారిఫ్‌ ఏరియా (డీటీఏ)లో నమోదైన 15% వృద్ధి దోహదపడిందని, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) నుంచి ఎగుమతులు  31% తగ్గాయని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ తెరచుకోవడంతో ఎగుమతులకు  గిరాకీ పునఃప్రారంభమవుతోందని జీజేఈపీసీ ఛైర్మన్‌ కొలిన్‌ షా అభిప్రాయపడ్డారు.


 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని