యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.955 కోట్లు
close

Published : 16/06/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.955 కోట్లు

నేటి నుంచి కిమ్స్‌ ఐపీఓ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ 43 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.955 కోట్లకు పైగా సమీకరించింది. ఈ సంస్థ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) బుధవారం (ఈ నెల 16న) ప్రారంభమై 18న ముగియనుంది. ఒక్కో షేరును రూ.815 నుంచి రూ.825 ధరకు జారీ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. మదుపరులు కనీసం 18 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ కంపెనీ రూ.200 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 2,35,60,538 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నారు. ఇందులో జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ కేహెచ్‌ పీటీ లిమిటెడ్‌ 1,60,03,615 షేర్లు విక్రయిస్తుండగా, ప్రమోటర్లు అయిన భాస్కరరావు బొల్లినేని, రాజ్యక్ష బొల్లినేని, బొల్లినేని రమణయ్య మొమోరియల్‌ హాస్పిటల్స్‌, ఇతరులు కలిపి మిగిలిన షేర్లను విక్రయిస్తున్నారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌ సిబ్బందికి రూ.20 కోట్ల విలువైన షేర్లను రిజర్వు చేశారు. మొత్తం ఇష్యూ పరిమాణం రూ.2150 కోట్లు అవుతోంది. ఇందులో రూ.150 కోట్లను అప్పు తీర్చటానికి వినియోగిస్తారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌కు ప్రస్తుతం 3,000 కు పైగా పడకలు ఉండగా, వచ్చే అయిదేళ్లలో మరో 2,000 పడకలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది.  
దొడ్ల డెయిరీ కూడా: హైదరాబాద్‌కే చెందిన దొడ్ల డెయిరీ పబ్లిక్‌ ఇష్యూ కూడా ఈ నెల 16 న మొదలై 18న ముగుస్తుంది. ఈ కంపెనీ రూ.50 కోట్ల విలువైన షేర్లను కొత్తగా జారీ చేస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 1,09,85,444 షేర్లను టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్‌తో పాటు దొడ్ల సునీల్‌రెడ్డి, దీపా రెడ్డి విక్రయిస్తున్నారు. ఒక్కో షేరుకు రూ.421 నుంచి రూ.428 ధరల శ్రేణి నిర్ణయించారు. మదుపరులు కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.156 కోట్లు సమీకరించినట్లు సంస్థ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని