స్వల్ప స్థిరీకరణకు అవకాశం!
close

Published : 18/10/2021 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్ప స్థిరీకరణకు అవకాశం!

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, వేగవంతమైన కొవిడ్‌ టీకా ప్రక్రియ, ఆర్థిక రికవరీలతో గత వారం దేశీయ మార్కెట్లు తాజా రికార్డు గరిష్ఠాలను అధిరోహించాయి. పండగల సీజన్‌ నేపథ్యంలో గిరాకీ పుంజుకోవడం, విమానయాన రంగానికి నిబంధనల సడలింపు కలిసొచ్చాయి. భారత ఆర్థిక వ్యవస్థ 2021లో 9.5 శాతం, 2022లో 8.5 శాతం వృద్ధి చెందొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 11.9 శాతం పెరిగింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.35 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 10.7 శాతానికి శాంతించాయి. దేశ ఎగుమతులు 22.6 శాతం పెరిగి 33.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 22.6 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. పీఎం గతి శక్తి యోజన ద్వారా రూ.111 లక్షల కోట్ల మౌలిక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. కంపెనీల ఫలితాల సీజన్‌తో సానుకూలతలు కొనసాగాయి. అయితే ముడిచమురు ధరలు అప్రమత్తతకు కారణమయ్యాయి. ఆర్థిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 3 శాతం పెరిగి 84.9 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయ 75.3కు బలహీనపడింది. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లు రాణించాయి. ద్రవ్యోల్బణ భయాలు, కమొడిటీ ధరలు, అమెరికా ఫెడ్‌ అంశాలను మదుపర్లు పక్కనపెట్టారు. ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.1 శాతం లాభంతో 61,306 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.5 శాతం పెరిగి 18,339 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, వాహన, లోహ షేర్లు రాణించాయి. ఐటీ, ఆరోగ్య సంరక్షణ, చమురు- గ్యాస్‌ స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా  రూ.1737 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.3,297 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అక్టోబరులో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐ) నికరంగా రూ.1472 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1 గా నమోదు కావడం.. పెద్ద షేర్లలో స్టాక్‌ రొటేషన్‌ను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: 61353 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌, లాభాల్లో ముగిసింది. స్వల్పకాలంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు 60,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 60,000 దగ్గర మరో మద్దతు లభించొచ్చు. ఇటీవలి మార్కెట్‌ లాభాల నేపథ్యంలో కొంత స్థిరీకరణకు అవకాశం లేకపోలేదు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపొచ్చు. కార్పొరేట్‌ ఫలితాల ఆధారంగా షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించనున్నాయి. భవిష్యత్‌పై అంచనాలు, తయారీ ఖర్చులపై యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. బొగ్గు కొరత, ఇంధన సంక్షోభం, సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత, ముడిచమురు ధరల పెరుగుదల వంటి వాటిపై మదుపర్లు దృష్టిపెట్టొచ్చు. ఈ వారం అల్ట్రాటెక్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఏసీసీ, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ, ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. కొన్ని వారాల్లో పెద్ద ఐపీఓలు రానుండటంతో కొంత లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయాలు, బ్యాంకు రుణాల వృద్ధిపై కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా జీడీపీ, అమెరికా గృహాల అమ్మకాలు, జపాన్‌ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ముడిచమురు ధరల జోరు కొనసాగితే మార్కెట్ల లాభాలకు కళ్లెం పడొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచీ సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 60,737, 60,331, 59,811
తక్షణ నిరోధ స్థాయులు: 61,800, 62,500, 63,000
ఇటీవలి ర్యాలీ నేపథ్యంలో కొంత స్థిరీకరణకు అవకాశం ఉంది.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని