ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..! - govt to overhaul fiscal roadmap may aim budget deficit at 4percent of gdp by fy26
close

Updated : 19/01/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసారికి ‘లోటు’పాట్లను పట్టించుకోకుండా..!

 ఎఫ్‌ఆర్బీఎం చట్టంలో ఈ సారి సవరణ
భారీగా ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడులు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఓ మధ్యతరగతి కుటుంబ ఆదాయం పరిమితంగా ఉంటుంది.. ఇంటి పనులకో.. వైద్య ఖర్చులకో అదనపు సొమ్ము అవసరమైతే ఆ నెలకు చేబదులు తెస్తారు.. తర్వాత తీర్చేస్తారు. అలానే దేశాలను పాలించే ప్రభుత్వాలకు కూడా ఆదాయాన్ని మించిన అదనపు ఖర్చులకు నిధుల కొరత ఏర్పడుతుంది. దీనిని ద్రవ్యలోటు అంటారు. దీనిని ఎదుర్కొనేందుకు నిధులను అరువు తెస్తారు. ఆ నిధులతో వ్యవస్థలో ఉపాధి, వ్యాపారాలను పెంచి సంపద సృష్టించి అప్పులు తీర్చేస్తారు. అంతే గానీ.. నోట్లను అచ్చేసుకుంటూ పోతే కరెన్సీ విలువ పడిపోయి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.

మన పరిస్థితి ఏమిటీ..?

ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌-19 వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దీంతో ప్రభుత్వ ప్రణాళికల అమలుకు తగినంత ఆదాయం లభించలేదు. ద్రవ్యలోటు జీడీపీ విలువలో 7-8శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ.. ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం మధ్యస్థాయి ద్రవ్యలోటు 3శాతం ఉండొచ్చని నిర్దేశించారు. కానీ, 2014-15 నుంచి 2020-21 వరకు ఏ సంవత్సరమూ ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాంటిది కొవిడ్‌ ప్రభావిత ఆర్థిక పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని చేరడం దాదాపు అసాధ్యం.

ప్రభుత్వం ఏమి చేయవచ్చు..?

కొవిడ్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ప్రజల వద్దకు మళ్లీ డబ్బులు వెళ్లాలి. అలా జరగాలంటే.. ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా పెరగాలి. భారీ ప్రాజెక్టులు చేపట్టడం.. ఇతర కార్యక్రమాలు అమలు చేసి వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాలి.  ఈ క్రమంలో ప్రభుత్వం తన రాబడికి మించి వెచ్చించాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవ్యలోటు పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటు 4 శాతానికి రావాలంటేనే కనీసం నాలుగైదేళ్లు పడుతుంది.  దీనిని అర్థం చేసుకొనే 15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 బడ్జెట్ల వరకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. దీనిని కూడా బడ్జెట్‌తోపాటు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  దీనిలో ద్రవ్యలోటు లక్ష్యాల నుంచి ఉపశమనం కల్పించవచ్చు. కాకపోతే ఏ ఏడాదికి ఆ ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాలను ప్రత్యేకంగా నిర్దేశించవచ్చు.  దీనికోసం ఎఫ్‌ఆర్బీఎం చట్టంలో మధ్యస్థాయి ద్రవ్యలోటును సవరించే అవకాశం ఉంది.

ముందే సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి..

ప్రస్తుత సంవత్సరం కొవిడ్‌ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తొలి అర్ధ భాగం దారుణంగా దెబ్బతింది. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా రూ.29లక్షల కోట్ల విలువైన కొవిడ్‌ ప్యాకేజీలను విడతల వారీగా ప్రకటించింది. ఇవన్నీ 2020-21 బడ్జెట్‌కు అదనంగా ప్రకటించినవే. అంటే బడ్జెట్‌లో నిర్దేశించిన 3.5శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం పక్కన పెట్టేసిందనే అర్థం.  రాబోయే బడ్జెట్‌లో భారీగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు ఉండనున్నాయి. వీటిల్లో మౌలిక రంగంతోపాటు వైద్య రంగంపై కూడా వ్యయాలు పెరగనున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దవ్యలోటు ఆందోళనలను పక్కనబెట్టవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ఆర్థిక మంత్రికి అండదండలు

మండుతున్న పెట్రోల్‌ ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని