Stock Markets: రోజంతా అదే జోరు.. 60వేల మార్కును నిలబెట్టుకున్న సెన్సెక్స్‌ - sensex ended above 60k
close

Published : 24/09/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Markets: రోజంతా అదే జోరు.. 60వేల మార్కును నిలబెట్టుకున్న సెన్సెక్స్‌

ముంబయి: ఆరంభంలోనే 60,000 పాయింట్ల ఎగువన ప్రారంభమై చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ శుక్రవారం రోజంతా అదే జోరును కొనసాగింది. స్వల్పకాలం మినహా దాదాపు రోజంతా 60 వేల ఎగువనే ట్రేడింగ్‌ నమోదయ్యింది. నిఫ్టీ సైతం రికార్డు స్థాయి గరిష్ఠాల్లో పయనించింది. ఉదయం 60,158.76 పాయింట్ల వద్ద జోష్‌ మీద ప్రారంభమై సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 60,333 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 163 పాయింట్లు లాభపడి 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం దాదాపు ఇదే దూకుడును ప్రదర్శించింది. 18,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంటుందని భావించినప్పటికీ.. గరిష్ఠాల వద్ద నిరోధం ఎదురుకావడంతో పైకి ఎగబాకలేకపోయింది. ఉదయం 17,897.45 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 17,947.65 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.75 వద్ద ముగిసింది.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సంక్షోభంలో ఉన్న చైనా స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్.. వడ్డీ చెల్లింపులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో సూచీలు కాస్త అప్రమత్తంగా కదలాడాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫ్యూచర్స్‌ సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీ 50 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ, గ్రాసిమ్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో షేర్లు రాణించాయి. టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్‌, శ్రీ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, టాటా కన్జూమర్స్‌ షేర్లు డీలాపడ్డాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని