close
ఎగ్గొట్టకపోతే ఒట్టు..!

బ్యాంకింగ్‌ రంగం
ముద్రా రుణాలు
గుదిబండగా మారుతున్న రుణాలు
మూడేళ్లలో రూ. 11,000 కోట్ల నిరర్థక ఆస్తులు
ఈనాడు వాణిజ్య విభాగం

బ్యాంకులకు నిరర్థక ఆస్తుల బెడద వదిలేలా కనిపించడం లేదు. రూ.లక్షల కోట్ల బకాయిలు పేరుకుపోయి, గుదిబండగా మారిన కార్పొరేట్‌ సంస్థల రుణాలకు గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంకులు భారీగా కేటాయింపులు జరిపి, ఉపశమనం కలిగించుకున్నాయి. ఇంతలోనే.. ముద్రా పథకం కింద ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా మారుతుండటం బ్యాంకులకు కలవరం కలిగిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి (ఎస్‌ఎంఎంఈ) సంస్థలకు రూ.10 లక్షల వరకు రుణాలిచ్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ముద్రా పథకం బ్యాంకులకు మరో గుదిబండ కానుందా..?

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక, దేశీయ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. దేశ జీడీపీలో మూడోవంతుకు పైగా వాటా కలిగిన ఈ రంగం 12 కోట్ల మందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఎంఎస్‌ఎంఈ శాఖ 2017-18లో విడుదల చేసిన నివేదిక వెల్లడిస్తోంది. ఉద్యోగాలకు సంబంధించి 2015-16 నాటి గణాంకాలే శాఖ వద్ద ఉన్నాయి. తదనంతరం మరింతగా పెరిగి ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగం వృద్ధి కోసం ప్రధాన్‌మంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015 ఏప్రిల్‌లో ప్రారంభించారు. వ్యాపారాభివృద్ధి కోసం ఎంఎస్‌ఎంఈలకు రూ.10 లక్షల వరకు రుణాలివ్వాలని నిర్దేశించారు. ఈ రుణాలపై వడ్డీరేట్లు 8-12 శాతంగా ఉన్నాయి. ఈ పథకం అమలు సంతృప్తికరంగా ఉందని, దీనికింద ఇచ్చిన రుణాల్లో ఒత్తిడికి గురవుతున్నవి 5 శాతమేనని ఆర్థికశాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. 2016-17తో పోలిస్తే 2017-18లో ముద్రా రుణాల్లో ఎన్‌పీఏల సంఖ్య 92 శాతం పెరగడం బ్యాంకర్లను ఆందోళనకు గురిచేసింది. దీంతో 2018-19లో ఈ రుణాల మంజూరులో బ్యాంకర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రారంభించారు. అయినా కూడా గత ఆర్థిక సంవత్సర మొదటి 3 త్రైమాసికాల్లో ముద్రా రుణాల్లో ఎన్‌పీఏల సంఖ్య 50 శాతం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. 2018 ఆగస్టు నాటికి 21 ప్రభుత్వరంగ బ్యాంకులు మూడేళ్లుగా ఇచ్చిన ముద్రా రుణాల్లో ఎన్‌పీఏలు రూ.11,000 కోట్లకు చేరాయన్నది బ్యాంకింగ్‌ వర్గాల సమాచారం.

రాజన్‌ హెచ్చరించారు కూడా

ప్రభుత్వం ఏ పథకాన్ని చేపట్టినా, ప్రాధాన్యతగా పరిగణించాలని, రుణాలు విరివిగా మంజూరు చేయాలనే ఒత్తిళ్లు బ్యాంకర్లపై వస్తుంటాయి. ముద్రా పథకం కింద మంజూరవుతున్న రుణాల్లో నష్టభయం ఉందని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త, పార్లమెంటరీ అంచనాల కమిటీకి రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ అయిన రఘురామ్‌ రాజన్‌ గతేడాది విశదీకరించారు. రుణ మంజూరుకు లక్ష్యాలు ఇచ్చి పూర్తిచేయమనడంతో, పూర్తిస్థాయి నిశిత పరిశీలన జరపకుండానే బ్యాంకర్లు జారీ చేస్తున్నారని రాజన్‌ తెలిపారు. ఇది భవిష్యత్తులో ఎన్‌పీఏలు పెరిగేందుకు కారణమవుతాయనీ హెచ్చరించారు. ముద్రా రుణాలతో పాటు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులనూ నిశితంగా పరిశీలించాలనే సలహా ఇచ్చారు. ఆర్‌బీఐ కూడా ముద్రా రుణాల విషయంలో తన ఆందోళనను ఆర్థిక శాఖకు తెలియపరచింది. ఎన్‌పీఏలు భారీగా పెరిగేందుకు ఈ రుణాలు కారణమవుతాయని పేర్కొంది. 

రుణాల మంజూరు ఇలా

వ్యాపార సంస్థ స్థాయికి అనుగుణంగా రుణాల మంజూరు ఉంటుంది.
* రూ.50,000 వరకు: శిశు విభాగం   - రూ.50,001-5 లక్షల వరకు: కిశోర్‌ విభాగం
* రూ.5,00,001-10 లక్షల వరకు: తరుణ్‌ విభాగం కింద మంజూరు చేయాలనేది లక్ష్యం.
* తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా వర్కింగ్‌ క్యాపిటల్‌, కాలావధి రుణాలుగా మంజూరు చేయాలి. ఆదాయ ఆర్జన, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ రుణాలివ్వాల్సి ఉంది. దుకాణదారులు, స్వర్ణకారులు, కోళ్లఫారాలు, చేపల పెంపకందారులు కూడా పొందొచ్చు.
* ముద్రా అనేది రీఫైనాన్సింగ్‌ సంస్థ మాత్రమే. ఏ సంస్థ, వ్యక్తికీ రుణాలు నేరుగా ఇవ్వదు. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ), చిన్న రుణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ), సూక్ష్మరుణ సంస్థ (ఎంఎఫ్‌ఐ)లు మాత్రమే మంజూరు చేస్తాయి. రుణాలు అవసరమైన వారు సమీపంలోని ఈ సంస్థల శాఖలను ఆశ్రయించాల్సి ఉంటుంది.
* ఎటువంటి పూచీకత్తు అవసరం లేకుండా రుణం మంజూరు చేయడం దీని ప్రత్యేకత. ప్రాసెసింగ్‌ ఛార్జీలు కూడా లేవు. సూక్ష్మ సంస్థల రుణ పూచీ (సీజీఎఫ్‌ఎంయూ), నేషనల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) వీటికి పూచీకత్తు ఇస్తున్నాయి.
* ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. www.mudramitra.in పోర్టల్‌ను ఇందుకు వినియోగించుకోవచ్చు.
* ఈ రుణాల మంజూరుకు ఏజెంట్లు ఎవరూ లేరు. కొందరు తమకు తాము ముద్రా ఏజెంట్లుగా చెప్పుకుంటూ, మోసగిస్తున్నారని సమాచారం.

తాజా పరిస్థితి ఇదీ

ఒక్క గుజరాత్‌లోనే జనవరి-మార్చి త్రైమాసికంలో ముద్రా ఎన్‌పీఏలు రూ.516.32 కోట్లకు చేరాయి. డిసెంబరు త్రైమాసికం నాటి ఎన్‌పీఏలతో పోలిస్తే, ఇవి 34 శాతం అధికమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తేల్చి చెప్పింది. ఇందులో అధిక వాటా తక్కువ మొత్తం రుణాలు పొందే శిశు విభాగానిదే. ఈ విభాగం నుంచే రూ.210 కోట్లు ఎన్‌పీఏలు అయ్యాయి. ఇదే సమయంలో వసూలు కావాల్సిన మొత్తం రూ.8671 కోట్ల నుంచి రూ.10,085 కోట్లకు చేరింది.

ఎందుకిలా జరుగుతోంది?

బ్యాంకులు కార్పొరేట్‌ సంస్థలకు భారీమొత్తం రుణాలిచ్చేందుకు ప్రధాన కారణం.. పరిశీలన సులభమవుతుంది, ఎక్కువ మంది సిబ్బంది అవసరం ఉండదు. చిన్నమొత్తం రుణాలు ఎక్కువమందికి ఇస్తే, ఆయా ఖాతాలు, వ్యాపార సంస్థల పరిశీలన, వసూళ్ల అనుశీలనకు అత్యధిక సిబ్బంది అవసరం అవుతారు. ఇది కష్టం కావడం వల్లే, ముద్రాలో శిశు, కిశోర్‌ విభాగాల్లోనే మొండిబకాయిలు  అధికమవుతున్నాయన్నది బ్యాంకర్ల సమాచారం. ఎటువంటి పూచీకత్తు లేని నేపథ్యంలో, రికవరీ కష్టంగా మారిందనీ చెబుతున్నారు.

50,000 మోసాలు.. రూ.2 లక్షల కోట్ల నష్టాలు
 గత 11 ఏళ్లలో బ్యాంకుల బెంబేలు
  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులూ బాధిత సంస్థలే

దిల్లీ: దేశీయంగా గత 11 ఏళ్లలో బ్యాంకుల్లో 50,000కు పైగా మోసాలు చేసుకున్నాయని, వీటి విలువ రూ.2.05 లక్షల కోట్లని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో కూడా అధిక సంఖ్యలో మోసాలు చోటుచేసుకున్నాయని సమాచారం. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు మొత్తం 53,334 మోసం కేసులు నమోదు కాగా, వీటిల్లో రూ.2.05 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. మోసాలు సంఖ్యా పరంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో అధికంగా చోటుచేసుకున్నా, విలువ పరంగా చూస్తే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఎక్కువమొత్తం నష్టం వాటిల్లింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో  2497 కేసుల్లో రూ.1200.79 కోట్ల నష్టం వాటిల్లింది. విదేశీ బ్యాంకుల్లోనూ మోసాలు జరిగిన వాటిల్లిన నష్టం మొత్తం తక్కువగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలోనే షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, కొన్ని ఆర్థిక సంస్థల్లో చోటుచేసుకున్న 6801 మోసాల్లో రూ.71,542.93 కోట్ల నష్టం వాటిల్లిందని వార్తలు రావడంతో, ఆర్థిక మోసాలపై శ్వేతపత్రం విడుదల చేయాలనే డిమాండ్లూ వచ్చాయి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.