అలాంటి అవకాశాలు వదులుకోవాల్సినవి కావు - Former Pakistan Players lashed out their team for losing in the first test against England
close
Published : 10/08/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి అవకాశాలు వదులుకోవాల్సినవి కావు

పాక్‌ జట్టుపై మాజీ ఆటగాళ్ల అసంతృప్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడిన తొలి టెస్టులో పాకిస్థాన్‌ గెలిచే అవకాశం ఉన్నా కీలక సమయంలో వికెట్లు పడగొట్టలేక చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించినా నాలుగో రోజే ఇంగ్లాండ్‌ విజేతగా నిలవడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలవాల్సి ఉన్నా చేజేతులా మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బౌలర్లు 117 పరుగులకే సగం ఇంగ్లీష్‌ జట్టును పెవిలియన్‌కు పంపినా, తర్వాత ఆడిన క్రిస్‌వోక్స్‌(84*), జాస్‌ బట్లర్‌(75)లను అడ్డుకోలేకపోయింది. అలా పాక్‌ ఓటమి పాలుకావడంతో మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్‌ అనంతరం వసీమ్‌ అక్రమ్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ కెప్టెన్‌ అజర్‌ అలీ నాయకత్వ నిర్ణయాలను తప్పుబట్టాడు. అతడు కొన్ని అవకాశాలు జారవిడిచాడని, ఈ ఓటమితో పాక్‌ అభిమానులు బాధపడ్డారని చెప్పాడు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా కెప్టెన్‌గా అజర్‌ విఫలమయ్యాడన్నాడు. 

యువ బౌలర్లు షాహీన్‌ అఫ్రిది, నసీమ్‌ షాలకు ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ ఇవ్వలేదని, దాంతో వోక్స్‌, బట్లర్ తేలిగ్గా పరుగులు చేయగలిగారని చెప్పాడు. ఇదే విషయంపై మాజీ సారథి షాహిద్‌ అఫ్రిది ట్వీట్‌ చేస్తూ తొలుత ఇంగ్లాండ్‌ గెలిచినందుకు అభినందనలు చెప్పాడు. తమ జట్టుకు గెలిచే అవకాశం ఉన్నా దురదృష్టవశాత్తూ ఓడిపోయిందని, అలాంటి అవకాశాలు వృథా చేసుకోవాల్సినవి కాదన్నాడు. అలాగే మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ యూసుఫ్‌ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 219 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యేసరికి పాకిస్థాన్‌కు 107 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత ఇంగ్లాండ్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులే చేసింది. అయినా ఇంగ్లాండ్‌ ముందు 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌ చేస్తుండగా 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అప్పుడే బట్లర్‌, వోక్స్‌ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని