కొవిడ్-19తో అనారోగ్యం..ఎంతకాలం? - How long can I expect a Covid 19 illness to last
close
Published : 13/10/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్-19తో అనారోగ్యం..ఎంతకాలం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ బారినపడుతున్న వారిసంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటోంది. ఈ సమయంలో కరోనా వైరస్‌ నెగటివ్‌ వచ్చినప్పటికీ కొందరిలో దాని ప్రభావం మరికొంత కాలంపాటు ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నారు. అయితే, ఆ అనారోగ్య సమస్యలు ఎంతకాలం ఉంటాయి, పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటుండగా, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కొన్ని వారాలు, నెలలపాటు వైరస్‌ లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, అధికరక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వైరస్‌నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా వైరస్‌ బారినపడి కోలుకోవడానికి రెండు నుంచి ఆరువారాల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేస్తోంది. ఈ సమయంలో, కోలుకున్న అనంతరం ఈ వైరస్‌ ప్రభావం ఏవిధంగా ఉంటుందన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికాలో జరిగిన తాజా పరిశోధన మరికొన్ని విషయాలను వెల్లడించింది. వైరస్‌ సోకి ఆసుపత్రిలో చేరని 20శాతం మంది(18నుంచి 34ఏళ్ల వారు)లో లక్షణాలు రెండువారాలపాటు ఉంటున్నట్లు తేల్చింది. 50ఏళ్ల పైబడిన వారిలో దాదాపు సగం మందికి ఇదేవిధంగా ఉంటున్నట్లు గుర్తించామని తెలిపింది.

ఇక కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఈ ఆరోగ్యసమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నట్లు పేర్కొంది. వైరస్‌ బయటపడిన తర్వాత మూడు నాలుగు నెలలు గడుస్తున్నా చాలా మంది రోగులు దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చికాగోకు చెందిన శ్వాసకోశ నిపుణులు డాక్టర్‌ ఖలీలా గేట్స్‌ వెల్లడించారు. కరోనా రోగులు పూర్తిగా కోలుకొని సాధారణస్థితికి ఎప్పటిలోగా వస్తారనే విషయాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నామని తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతం కలవరపెడుతోన్న ఈ విషయాలపై మా దగ్గర కచ్చితమైన సమాధానం కూడా లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

వైరస్‌నుంచి కోలుకుంటున్నవారిలో ఎలాంటి వ్యక్తుల్లో మళ్లీ ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని అంచనా వేయడం కష్టంగానే ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే ఆస్కారం ఉంది. గుండెలో మంట, మూత్రపిండాల పనితీరును తగ్గించడం, తికమక ఆలోచనలు, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వైరస్‌ నేరుగా లేదా అది కలిగించే నొప్పి, మంటవల్ల ఈ దీర్ఘకాలిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయా? అనే దానిపై స్పష్టత లేదని ఎమోర్నీ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు డాక్టర్‌ జయ్‌ వర్కీ వెల్లడించారు. తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ వైరస్‌ ప్రభావం పూర్తిగా ముగిసిపోలేదనే విషయాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని