
తాజా వార్తలు
హృతిక్ మంచోడిలా కనిపిస్తున్నాడు: కంగన
ముంబయి: బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ పెడ్నేకర్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ మండిపడ్డారు. ఆఫీసు కూల్చివేత కేసులో న్యాయస్థానం కంగనకు అనుకూలంగా తీర్చు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్న మేయర్ కిశోరీ పెడ్నేకర్ కంగనను ‘రెండు రకాల స్వభావాలున్న వ్యక్తి’ అని వ్యాఖ్యానించారు. ‘హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ముంబయికి వచ్చి.. ఈ ప్రదేశాన్ని ‘పాక్ ఆక్రమిత భూభాగం’ అనడం పట్ల మేమంతా షాక్ అయ్యాం’ అని చెప్పారు. కంగన ఆ వీడియోను షేర్ చేస్తూ.. ‘గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఎదుర్కొంటున్న కేసులు, వేధింపులు, అవమానాలు చూస్తుంటే... బాలీవుడ్ మాఫియా, దానికి చెందిన ఆదిత్యా పంచోలీ, హృతిక్ రోషన్ లాంటి వ్యక్తులు మంచివారిగా కనిపిస్తున్నారు’ అంటూ కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
కంగన, హృతిక్‌కు మధ్య మాటలు లేవన్న సంగతి తెలిసిందే. ‘క్రిష్ 3’ (2013) షూటింగ్లో వీరు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఈ వదంతులపై ఇద్దరూ నోరు మెదపలేదు. చివరికి హృతిక్‌తో డేటింగ్లో ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో కంగన చెప్పారు. అయితే ఆమె వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. అంతేకాదు వీరిద్దరూ కలిసి నటించేందుకు సంతకం చేసిన ఓ ప్రాజెక్టు నుంచి కంగనను తొలగించారు. ఆపై ఇది కాస్త చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి దారి తీసింది. చివరికి ఆ కేసు ఏటూ తేలలేదు. కంగన పలుమార్లు హృతిక్‌ను ‘మాజీ ప్రియుడు’ అని సంబోధించారు.