‘పుల్వామా’పై మాట మార్చిన పాక్‌ మంత్రి - Pak Minister makes u turn on pulwama attack
close
Updated : 30/10/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పుల్వామా’పై మాట మార్చిన పాక్‌ మంత్రి

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ పనే అని అంగీకరించిన దాయాది దేశం పాకిస్థాన్‌ ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని పాక్‌ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి ఫవాద్‌ చౌధురి తాజాగా చెప్పడం గమనార్హం. పుల్వామా దాడి తర్వాత పరిస్థితుల గురించే తాను ప్రస్తావించానంటూ ఫవాద్‌ బుకాయించారు. అసలేం జరిగిందంటే..

గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగి 40 మందికి పైగా జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాక్‌ హస్తం ఉందని భారత్‌ వాదిస్తుండగా.. పాక్‌ మాత్రం పదే పదే బుకాయిస్తూ వస్తోంది. అయితే నాటి దుశ్చర్యలో తమ ప్రమేయం నిజమేనని ఫవాద్‌ చౌధురి గురువారం ఆ దేశ పార్లమెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత భూభాగంలోకి వెళ్లి మరీ ఆ దేశంపై దాడి చేశాం. పుల్వామా.. ఇమ్రాన్‌ నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘన విజయం. ఇందులో అందరూ భాగస్వాములే’ అని ఫవాద్‌ అన్నారు. అభినందన్‌ విడుదలకు ముందు పాక్‌ అగ్ర నాయకత్వం కాళ్లు వణికాయన్న విపక్ష నేత సాదిఖ్‌ వ్యాఖ్యలకు బదులిస్తూ ఫవాద్‌ ఈ విధంగా పేర్కొన్నారు.

అయితే ఫవాద్‌ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో తీవ్ర దుమారం చెలరేగడంతో నోరు జారినట్లు గ్రహించిన ఆయన వెంటనే నాలుక్కరుచుకున్నారు. ‘పుల్వామా ఘటన తర్వాత భారత భూభాగంలోకి వెళ్లి మరీ దాడి చేశాం’ అంటూ మాట మార్చారు. ఆ తర్వాత ట్విటర్‌ వేదికగా స్పందించిన ఫవాద్‌.. ‘పుల్వామా దాడి తర్వాత భారత్‌తో జరిగిన వైమానిక దాడి గురించే నేను పరోక్షంగా ప్రస్తావించాను. అమాయకులను చంపి మేం ధైర్యవంతులమని చూపించుకోవాలనుకోవట్లేదు. ఉగ్రవాదాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

అటు కొన్ని భారత జాతీయ మీడియా సంస్థలతోనూ మాట్లాడిన ఫవాద్‌.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నాని అన్నారు. ‘భారత్‌తో యుద్ధాన్ని మేం కోరుకోవట్లేదు. అది చాలా పెద్ద ప్రసంగం. ఎక్కడా నేను పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని చెప్పలేదు. పుల్వామా అనంతర పరిస్థితుల గురించే మాట్లాడాను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని చెప్పడం గమనార్హం. 

ఇదీ చదవండి..

పాక్‌ నాయకత్వానికి ముచ్చెమటలు!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని