PelliSandaD: క్రికెట్‌లోనే కాదు... సినిమాల్లోనూ ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటా! - Roshann interview about PelliSandaD
close
Published : 12/10/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PelliSandaD: క్రికెట్‌లోనే కాదు... సినిమాల్లోనూ ఆల్‌రౌండర్‌ అనిపించుకుంటా!

తెలుగు చిత్రసీమలో వారసుల సందడే ఎక్కువ. తారల కుటుంబాల నుంచి వస్తున్న నవతరం తమదైన ప్రతిభని ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. చిత్రసీమకి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. వందకిపైగా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన కథానాయకుడు శ్రీకాంత్‌ వారసుడు రోషన్‌ కూడా ఇప్పటికే తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా తన తండ్రి చేసిన ‘పెళ్లిసందడి’ పేరుతోనే ఓ సినిమా చేశాడు. అప్పటి చిత్రానికి దర్శకత్వం వహించిన కె.రాఘవేంద్రరావు, నేటి చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. ఆయన నటుడిగానూ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ‘పెళ్లిసందడి’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రోషన్‌తో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ. 

‘‘చిత్ర పరిశ్రమలో మనం అనుకుంటే అయ్యేవి తక్కువ అని, కొన్ని ఫ్లోలో జరిగిపోతుంటాయని మా నాన్న చెబుతుంటారు. నా సినీ ప్రయాణంలోనూ అదే జరిగింది. అనుకోకుండానే ‘నిర్మలా కాన్వెంట్‌’ చేసే అవకాశం వచ్చింది. టీనేజ్‌లో చేసిన సినిమా అది. ఇక కె.రాఘవేంద్రరావు సర్‌తో సినిమా అస్సలు అనుకోలేదు. అనుకోకుండానే ఆయన్నుంచి ‘పెళ్లిసందడి’ కోసం పిలుపొచ్చింది. తొలి సినిమా సమయానికి నేనొక బాలనటుడిగానే లెక్క. పూర్తిస్థాయిలో హీరోగా నేను పరిచయం అవుతున్న సినిమా అంటే ఇదే. రాఘవేంద్రరావు సర్‌తో సినిమా ఓ అదృష్టం అనుకుంటే, మా నాన్న చేసిన ‘పెళ్లిసందడి’ సినిమా పేరుతోనే, అది కూడా సరిగ్గా పాతికేళ్ల తర్వాత నేను చేయడం అంటే అంతా ఒక కలలా ఉంది. నేటితరం మొదలుకొని, కుటుంబ ప్రేక్షకుల వరకు అందరికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం. కరోనా తర్వాత ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టు వినోదాన్ని అందించే చిత్రమిది. తొలి అడుగుల్లోనే ఇలాంటి ఓ కుటుంబ కథ చేయడం ఓ మంచి అనుభవం’’.  

* ‘‘అమ్మానాన్నలు నటులే అయినా, మా ఇంట్లో సినిమా వాతావరణం అంతగా కనిపించేది కాదు. అప్పుడప్పుడు నాన్నతో కలిసి వేడుకలకి వెళ్లడం తప్ప! స్నేహితులు కూడా బయటవాళ్లే ఎక్కువ. నాన్నకి క్రికెట్‌ అంటే ఇష్టం. ఆయన నన్నొక క్రికెటర్‌లా చూడాలనుకునేవారు. అందుకే అటువైపు ప్రోత్సహించారు. నేను కూడా చిన్నప్పుడు క్రికెట్‌ బాగా ఆడేవాణ్ని.

అలా అండర్‌ 14 జట్టుకి రాష్ట్ర స్థాయిలో ఆడాను. రోజూ ఎంతో క్రమశిక్షణతో ఉదయాన్నే జింఖానా గ్రౌండ్‌కి వెళ్లి అక్కడ క్రికెట్‌ ఆడేవాణ్ని. ఒకదశలో క్రికెటర్‌గా రాణించాలంటే ఈ కష్టం సరిపోదేమో అనిపించింది. ఆ సమయంలోనే ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పట్నుంచి సినిమాపై ప్రేమ పుట్టింది. చదువుల్లో నేను అంత చురుకేమీ కాదు. 75 శాతం మార్కులొచ్చేవి. మా చెల్లి చాలా బాగా చదువుతుంది. మా తమ్ముడు నాకంటే బాగా చదువుతాడు. నేను అంతంత మాత్రమే. దాంతో ఏడాదికి మూడుసార్లు ప్రోగ్రెస్‌ కార్డ్‌ చేతికి ఇచ్చినప్పుడంతా ఇంట్లో గట్టిగా క్లాస్‌ పడేది. ఇంటర్‌ తర్వాత ఇక సినిమాపైనే దృష్టిపెడతానని ఇంట్లో చెప్పా. దాంతో అమెరికా, లాస్‌ ఏంజెలిస్‌లోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. అక్కడ ఒక ఏడాది డిప్లొమా పూర్తి చేసి తిరిగొచ్చా. సల్మాన్‌ఖాన్‌ నిర్మాణ సంస్థలో ‘దబాంగ్‌ 3’కి సహాయ దర్శకుడిగా పనిచేశా. అక్కడ తెర వెనక జరిగే ప్రక్రియనంతా క్షుణ్ణంగా అధ్యయనం చేశా. ఆ సినిమా ప్రయాణంలో సల్మాన్‌ఖాన్‌ నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకున్నా’’. 

* ‘‘అమ్మానాన్నలు నటన గురించి పెద్దగా సలహాలేమీ ఇవ్వరు. నాకే ఏదైనా సందేహం ఉంటే అడుగుతాను, వాళ్లు వాళ్ల అనుభవాల్ని చెబుతుంటారు. సెట్లో ఎలా మసలుకోవాలో చెబుతుంటారు. మా నాన్న దగ్గర కెరీర్‌, వ్యాపారానికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుతుంటా. వ్యక్తిగత విషయాలన్నీ అమ్మతో పంచుకుంటాను. మా తమ్ముడు, చెల్లికీ నాతో అనుబంధం ఎక్కువ. వాళ్లు ఏ సమస్యయినా ముందు నాతోనే పంచుకుంటారు. నాకు చిత్ర పరిశ్రమలో కంటే కూడా బయట స్నేహితులే ఎక్కువ. మా తమ్ముడు రోహన్‌ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ హారర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ‘పెళ్లిసందడి’ తర్వాత నేను చేయనున్న కొత్త సినిమా కూడా ఖరారైంది’’. 


‘‘నాకు సరిగ్గా గుర్తు లేదు కానీ స్కూల్‌కి వెళ్లే రోజుల్నుంచీ మా నాన్న నటించిన ‘పెళ్లి సందడి’ని చూస్తూనే ఉన్నా. ఆ సినిమా చూసినప్పుడంతా నాకు ఎక్కువగా పాటలే నచ్చేవి. ఎన్ని పాటలున్నాయో అనుకునేవాణ్ని. ఆ సినిమాలో నటించాకే మా నాన్నకి పెళ్లి అయ్యిందంట (నవ్వుతూ). నాకు మాత్రం ఆ అవకాశం లేదులెండి, ఎందుకంటే ఈమధ్యే నేను రెండు పదుల వయసు దాటాను. నా పెళ్లికి చాలా సమయం ఉంది. మా నాన్న కెరీర్‌లో ఆ సినిమా ఎంత ప్రత్యేకమో, ఇది కూడా నాకు అంతే. ఇకపై నేనెన్ని సినిమాలు చేసినా ఇది గుర్తుండిపోతుంది. చిత్రీకరణ అంతా చాలా సరదాగా సాగిపోయింది. రొమాంటిక్‌ సన్నివేశాల్లో కానీ, పోరాట ఘట్టాలు చేస్తున్నప్పుడు కానీ ఎక్కడా ఇబ్బంది పడలేదు. కె.రాఘవేంద్రరావు సర్‌ పర్యవేక్షణలో, దర్శకురాలు గౌరి రోణంకి చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. కచ్చితంగా ఇది పండగ సినిమా అనిపించుకుంటుంది. సీనియర్‌ నటులు చాలా మంది ఇందులో కీలక పాత్రలు పోషించారు. వాళ్ల నుంచి చాలా నేర్చుకున్నా. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’’. 


‘‘బాలీవుడ్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ నన్ను దక్షిణాదివాడు అనుకునేవారు కాదు. హృతిక్‌ రోషన్‌లా ఉన్నావనే ట్యాగ్‌ అయితే నాపై ఎప్పుడూ ఉంటుంది. హృతిక్‌ రోషన్‌ కాదు నేను, రోషన్‌ అంతే అని చెబుతుంటా. దక్షిణాది నుంచి వచ్చాను అని చెబితే అంతా ఆశ్చర్యపోయేవాళ్లు. ఇక్కడే కాదు, అక్కడ కూడా ఇలా ఉంటామని సరదాగా అనేవాణ్ని. వ్యక్తిగతంగా నాకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. అందుకు తగ్గట్టుగా నన్ను నేను సిద్ధం చేసుకున్నా. అయితే అన్ని రకాల సినిమాల్లోనూ నటించాలి, నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపన ఉంది. క్రికెట్‌లో నేను ఆల్‌రౌండర్‌ని. సినిమాల్లో కూడా అలాగే పిలిపించుకోవాలని ఉంది. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే కానీ... నెలకోసారైనా క్రికెట్‌ ఆడకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది’’.


 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని