close
Published : 28/02/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలా కనిపించడానికి కష్టపడ్డా

‘‘మానసికంగా.. శారీరకంగా నూటికి నూరు శాతం కష్టపడగలిగినప్పుడే నటిగా అందులోని సంతృప్తిని ఆస్వాదించగలుగుతాం’’ అంటోంది లావణ్య త్రిపాఠి. సందీప్‌ కిషన్‌కు జోడీగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ చిత్రంలో నటించింది. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మించారు. మార్చి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం విలేకర్లతో ముచ్చటించింది.
* ‘‘పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు, గ్లామర్‌ పాత్రలు చేసీ బాగా బోర్‌ కొట్టింది. కొత్తగా ఇంకేమన్నా ప్రయత్నించాలి అనుకుంటున్న సమయంలోనే.. ఓసారి సందీప్‌ కిషన్‌ నన్ను ముంబయిలో కలిశారు. ‘హాకీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నా అన్నారు. క్లుప్తంగా కథ చెప్పారు. వినగానే బాగా నచ్చింది. సందీప్‌కి చేస్తానని చెప్పా. ఇది ‘నట్‌పే తునై’ అనే తమిళ చిత్రానికి రీమేక్‌. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా దర్శకుడు కథలో 50శాతం వరకు మార్పులు చేశారు. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు కొందరు చేసే రాజకీయాల వల్ల అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అలా ఆటల వెనుకున్న రాజకీయ కోణాల్ని ఇందులో చర్చిస్తున్నాం. దీంతో పాటు చక్కటి ప్రేమకథ.. అన్ని రకాల వాణిజ్య హంగులు ఉంటాయి’’.
* ‘‘నేనిందులో లావణ్య రావు అనే హాకీ క్రీడాకారిణిగా కనిపిస్తా. ధైర్యంగా, ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి తను. ఈ పాత్రలో కనిపించడానికి చాలా కష్టపడ్డా. నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో క్రికెట్‌, బేస్‌బాల్‌, టెన్నిస్‌ వంటి ఆటలన్నీ ఆడా. హాకీతో మాత్రం పెద్దగా పరిచయం లేదు. ఈ చిత్రం కోసం కోచ్‌ సుధీర్‌ దగ్గర హాకీలో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నా. నిజమైన హాకీ ప్లేయర్‌లా కనిపించడానికి లైవ్‌ మ్యాచ్‌లు చూస్తూ.. ఆటగాళ్ల హావభావాల్ని బాగా గమనించా. అలాగే పాటల్లో తప్ప సినిమాలో నేనెక్కడా మేకప్‌ వేసుకోలేదు. ఆట నేపథ్యంగా వచ్చే సన్నివేశాలు చిత్రీకరించినన్ని రోజులూ శారీరకంగా చాలా కష్టంగా అనిపించింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ చిత్రం కోసం నేను బైక్‌ నడపడం కూడా నేర్చుకున్నా’’.
* ‘‘సందీప్‌ ముందు నుంచీ నాకు మంచి స్నేహితుడు. తనతో తమిళంలో ‘మాయావన్‌’ అనే చిత్రం చేశా. డెన్నిస్‌ జీవన్‌ కొత్తవాడైనా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నేను నటించిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది. అందులోనూ ఓ సవాల్‌తో నిండిన పాత్ర పోషించా’’.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని