సిత్తరాల సిరపడు పాట వెనుక కథ ఇది..!
close
Published : 19/01/2020 14:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిత్తరాల సిరపడు పాట వెనుక కథ ఇది..!

ఆరోజు నన్ను స్టేజ్ మీదకు ఎందుకు పిలవలేదో అప్పుడు తెలిసింది: సిత్తరాల పాట రచయిత

హైదరాబాద్‌: ‘సిత్తరాల సిరపడు..’.. ‘అల వైకుంఠపురములో..’ మారుమోగుతున్న జానపద గేయం ఇది. పతాక సన్నివేశాలకు ప్రాణం పోసి సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చిందీ పాట. అయితే ఈ పాట ఎవరు రాశారు?, ఎక్కడి నుంచి పుట్టింది?.. అనే ప్రశ్నలు సినిమా విడుదలైనప్పటి నుంచి సగటు ప్రేక్షకుడిలో రేకెత్తాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాటను ఎందుకు దాచిపెట్టారని కూడా అందరూ అనుకున్నారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈనాడుతో పంచుకున్నారు ‘సిత్తరాల..’ పాట రాసిన ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగి బల్లా విజయకుమార్. ఆయన చెప్పిన ముచ్చట్లు చూద్దాం..

విజయకుమార్ మీ నేపథ్యం ఏంటి?

మాది ఒడిశాలోని జయపూర్. ఉద్యోగ రీత్యా నాగావళి నుంచి వంశధార వరకు తిరిగా. ప్రస్తుతం మచిలీపట్నం ఎల్ఐసీ డివిజన్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకు గజల్స్, జానపద గేయాలంటే చాలా ఇష్టం. ఎల్ఐసీ నన్ను ఊరూరా తిప్పి అక్కడి జనపదాలను పరిచయం చేసింది. శ్రీకాకుళం, రాజాం, విజయనగరం, విజయవాడ, గాజువాక, వరంగల్‌లో పనిచేశాను.

ఈ పాట రాసే అవకాశం ఎలా వచ్చింది?

నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. చిన్న చిన్న గజల్స్ రాయడం అంటే ఇష్టం. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే రాసిస్తుంటాను. ఈ క్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సోదరుడు సీవీఆర్ శాస్త్రిగారితో మంచి అనుబంధం ఏర్పడింది. హుద్ హుద్ తుపాను సమయంలో నేను రాసిన సంకల్ప్ గీతం ఆయనకు బాగా నచ్చింది. ‘అల వైకుంఠపురములో..’ కోసం శ్రీకాకుళం యాసలో జానపద గేయం కావాలని దర్శకుడు త్రివిక్రమ్ అడిగారు. సీవీఆర్ శాస్త్రిగారు నా గురించి త్రివిక్రమ్ గారికి చెప్పారు. శ్రీకాకుళంలో బాగా ప్రజాదరణ పొందిన జానపద గేయాలు అన్వేషించమని కోరారు. రేలరేల జానకిరావుతోపాటు చాలా మందికి ఈ విషయాన్ని చెప్పా. వారు సరైన గీతం ఇవ్వలేకపోయారు. ‘దువ్వందొర’ అనే పాట ఒకటి దొరికింది, అది సరిపోతుందని చెప్పా. కానీ సందర్భోచితంగా లేదన్నారు. ఆపై నేనే ఒక పల్లవి, ఎనిమిది చరణాలు రాసిచ్చా. 

మీ పాట ఎలా ఫైనల్ అయ్యింది?

నేను రాసిన పాట త్రివిక్రమ్ గారికి బాగా నచ్చిందట. ఆ తర్వాత వారం రోజులకే త్రివిక్రమ్ గారిని కలిశాను. ఓ రోజు ఉన్నట్లుండి ఫోన్ చేసి మీ పాట రికార్డు, షూటింగ్ అయిపోయిందన్నారు. ఏదో సరదాగా రాశాం కదా.. నచ్చుతుందో లేదో అనుకున్నా.  ఆ తర్వాత త్రివిక్రమ్ గారు నాతో మాట్లాడుతూ.. వాళ్ల ఇంటికి ఆహ్వానించారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పాట నాకు వినిపించారు, ఆశ్చర్యపోయాను. పదాలన్నీ పాటల రూపంలో వస్తుంటే సంతోషమనిపించింది. 35 ఏళ్ల కిందట సినిమాకు పాట రాయాలని కలలు కన్నా. ఇన్నాళ్లకు ఆ కలను త్రివిక్రమ్ గారు నిజం చేశారు. 

ఈ పాటను ఎలా రాశారు?

నాకు ముందు ఒక సన్నివేశం చెప్పారు. దాని గురించి రాశాను. మళ్లీ వాళ్లు మార్చుకున్నారు. నేను కూడా మొత్తం మార్చి రాశా. పల్లవి బాగుంది, కానీ హీరో సెంట్రిగ్గా రాయండని అడిగారు. హీరో సెంట్రిగ్గా ఎలా ఉండాలని అడిగాను. కాలిపోతున్న ఇళ్ల దగ్గర పిల్లలను రక్షించడం, పడవ మునిగిపోతుంటే రక్షించడం ఇలా సాహసకృత్యాలకు సంబంధించి చూడండి అన్నారు. ముందు హేళనగా రాసిన పదాలను తర్వాత హీరో సెంట్రిగ్గా మార్చి రాశా. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహాలో రాశాను. ఆ తర్వాత పల్లవి అలాగే ఉంచి, మిగిలినది మళ్లీ మార్చాం. ‘బొగతోడు ఆంబోతు రంకేసి కుమ్మబోతే... కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురా..’ అని రాశా. తొలుత శ్రీకాకుళం పదాలు ఉండాలనే ఉద్దేశంతో... పీపలు, బొగతోడు లాంటి పదాలు వాడా.

సిత్తరాల సిరపడు అంటే..?

సిరపడు అనే పదాన్ని శ్రీకాకుళం ప్రాంతంలో పెంకితనం, అల్లరి పిల్లలను ఉద్దేశించి ఎక్కువగా వాడుతుంటారు. కరణాల భాష వేరుగా ఉంటుంది. ఒడిశాతో సంబంధం ఉండేవిధంగా వాళ్లకు కోడ్స్ ఉంటాయి. అలాగే విశ్వబ్రహ్మణులను కూడా కోడ్స్ ఉంటాయి. సిరపడు అనే పదాన్ని వాళ్లు కూడా వాడుతుంటారు. కస్టమర్లను గుర్తుపెట్టుకోడానికి వాళ్లు ఆ పదాన్ని విరివిగా వాడుతుంటారు. అది వాళ్ల వ్యాపార సూత్రం. సిరపడు అంటే.. ‘పెద్దగా బలం లేదు.. అయినా చురుకైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. మంతనాలు, పెత్తనాలు చేస్తుంటాడు..’ అని అర్థం.

మీరు సినిమాకు రాయడం ఇదే తొలిసారి కదా..?

అవును.. ఈ పాటను కూడా సీరియస్‌గా రాయలేదు. వాళ్లు ఏదో సందర్భం చెప్పారు. ఆ సందర్భానికి అనుగుణంగా పాట రాసిచ్చా. అయితే ఎక్కడా ఇంగ్లిషు పదాల ప్రభావం లేకుండా జాగ్రత్తపడుతూ వచ్చా. శ్రీకాకుళం జిల్లాలో వాడుతున్న కొన్ని పదాలు మరెక్కడా వాడుకలో ఉండవు. ప్రతి మాండలికంలో అంతే అనుకోండి. నేను రాసిన ప్రతి పదానికి మరో ఆప్షన్ ఇచ్చా. ఉదాహారణకు.. ‘ఉద్దండుడు’ అనే పదం ఉంది. దాన్ని ‘ఉడుంపట్టు’ అని కూడా వాడుకోవచ్చు. అయితే విడుదల చేసిన పాటలో ‘ఉడుంపట్టు’ అని ఉంది. ఇలా ఆప్షన్ ఇవ్వడం వల్ల నన్ను వాళ్లు తిరిగి అడగలేదు. ప్రత్యామ్నాయ పదాలు చూసుకొని వాడుకున్నారు.

మీ పాటను తెరపై చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది?

నా పాట తెరపై చూసినప్పుడు పెద్దబాల శిక్ష నాటిక, ఓ వీధి నాటకం చూసినట్టు అనిపించింది. 40 ఏళ్ల కిందటి నాటిక అది. ఒక వీధి నాటకం చూసిన అనుభూతి కలిగించింది. వీధి నాటకం చూసినప్పుడు డైలాగ్స్ కన్నా.. భంగిమలకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ నాటకాన్ని అర్థం చేసుకుంటారు. ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్‌ బాగా కంపోజ్ చేశారు. ఈ రోజు నా పాట తెరపై నాటకం ఆడింది. భలే సరదా అనిపించింది.

సినిమా విడుదలయ్యే వరకూ పాటను బయటపెట్టలేదు.. మీరు ఆ సమయంలో ఎలా ఫీల్‌ అయ్యారు?

సినిమా పూర్తైంది, విడుదలకు సిద్ధమవుతోంది. కానీ నా పాట ఎక్కడా వినిపించడం లేదు. సీవీఆర్ శాస్త్రిగారు నా పాట ఉందని గట్టిగా చెబుతున్నారు. అయినా పెద్దగా ఫీలవ్వలేదు. ఇది నా వృత్తి కాదు కదా. ఏదో సరదాగా రాసిందేగా అనుకున్నా. ఏదో ఒక జ్ఞాపకంగా ఉంటుందని రాశా. సినిమా వాళ్లను అస్సలు నమ్మలేం అంటుంటారు కదా.. అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ చివరికి చాలా పాజిటివ్‌గా తీసుకున్నా. మ్యూజికల్ నైట్ కోసం హైదరాబాద్ వచ్చా. అక్కడ నన్ను స్టేజ్ మీదకు పిలవలేదు. అయినా కూడా ఏం ఫీలవలేదు. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయనుకున్నా. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. మనమేదో చిన్న ఏమోషన్ గురించి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదని ఊరుకున్నా. త్రివిక్రమ్ గారు చాలా గొప్ప వ్యక్తి. పాట తీసేంత పని చేయరని నా నమ్మకం.

ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి కాఫీకి రమ్మని పిలవగానే నమ్మలేకపోయా. రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల వరకు నాతో మాట్లాడారు. నేను రాసిన పాటలు, గజల్స్ విన్నారు. వాటిలో రెండు ఆయనకు బాగా నచ్చాయి. అసలు విషయాన్ని చెప్పడంతో అసలు సంగతి ఇదా అని ఊరుకున్నా. అయితే సినిమా అయినంత వరకు నిశ్శబ్దంగా ఉండే త్రివిక్రమ్ గారు... ఒక్కసారి ఈ పాట గురించే చెప్పడం మొదలుపెట్టారు. ‘సిత్తరాల’ పాట దాచిపెట్టడం గురించి వివరించారు. అస్సలు భేషాజాలు లేకుండా నాకు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోలేని విషయం. వాస్తవానికి నన్ను పరిచయం చేసినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి.

జానపద సాహిత్యం గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా?

శ్రోతల ఆదరణకు నోచుకోకపోవడం వల్ల జానపద వాంగ్మయం చాలా వరకు దెబ్బతింటోంది. జానపద సాహిత్యాన్ని ఆదరించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో జనాలు ఉన్నారు. త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఇలాంటి పాటల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం చాలా అవసరం. సామెతలు, నానుడి తెలుసుకోవడంతోపాటు జానపద సాహిత్యం తయారవ్వాలి. వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్రకు తన పాటలతో ఎంతో మేలు చేశారు. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన పాటలంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో సందర్భోచితంగా వాటికి ప్రాధాన్యత ఇస్తే జనాదరణ పొందుతాయి. జానపద పదాల అర్థాలు వ్యాప్తి చెందాలి. అలా అయితేనే వాటి గురించి నలుగురికి చెప్పగలుగుతారు.

మీ తోటి వారు ప్రోత్సహించారా?

నా స్నేహితులు, తోటి ఉద్యోగులు, సీవీఆర్ శాస్త్రిలాంటి వాళ్లు నన్ను చాలాసార్లు సినిమా పాటలు ఎందుకు రాయవని అడిగారు. కానీ నా పాటలు సినిమాలకు పనికొస్తాయో? లేదో? అనే సందేహంతో ఉండేవాడిని. ఉద్యోగం చేసుకుంటూ నా పాటలు నేను పాడుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకున్న పరిమిత జ్ఞానం, పదాలతో నేను ఇలాంటి మరిన్ని పాటలు రాయడానికి సిద్ధంగా ఉన్నా.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని