MLC రమేష్‌ యాదవ్‌కు బెదిరింపు కాల్స్‌
close
Updated : 03/07/2021 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MLC రమేష్‌ యాదవ్‌కు బెదిరింపు కాల్స్‌

తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యను ప్రస్తావిస్తూ హెచ్చరికలు 

ఈనాడు డిజిటల్‌, కడప: గవర్నర్‌ కోటాలో ఇటీవల ఎమ్మెల్సీగా నియమితుడైన కడప జిల్లా ప్రొద్దుటూరువాసి ఆర్‌.రమేష్‌ యాదవ్‌కు వరుసగా రెండు రోజులు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. ప్రొద్దుటూరులో హత్యకు గురైన తెదేపా బీసీ నాయకుడు నందం సుబ్బయ్య మాదిరిగానే చంపుతామని తనను బెదిరించారని ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌తోపాటు వైకాపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు, ఫిర్యాదుదారు తెలిపిన వివరాల మేరకు.. జూన్‌ 25న అర్ధరాత్రి 12.15, 12.37 గంటలకు రెండు వేర్వేరు ఫోన్‌ నంబర్ల నుంచి రమేశ్‌కు ఫోన్‌ చేసి బెదిరించారు. 26న రాత్రి రెండు సార్లు ఫోన్లు వచ్చాయి. రమేష్‌ 28న ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరు వదిలి వెళ్లాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది నాన్‌-కాగ్నిజెబుల్‌ నేరంగా గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసం పోలీసులు ప్రొద్దుటూరులోని మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్‌ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదుకు పోలీసులకు అనుమతినిస్తూ కోర్టు జూన్‌ 30న ఆదేశాలనిచ్చింది. అంతర్జాలం నుంచి ఈ కాల్స్‌ వస్తున్నాయని పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. బెదిరింపు కాల్స్‌ చేసినవారు నందం సుబ్బయ్య హత్యను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గతేడాది డిసెంబరు 29న కొందరు సుబ్బయ్యను వేటకొడవళ్లతో నరికి చంపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డిపై అప్పట్లో సుబ్బయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని