డ్రెసెల్‌ దూకుడు
close
Published : 30/07/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రెసెల్‌ దూకుడు

ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం సొంతం

స్విమ్మింగ్‌ దిగ్గజం మైకెల్‌ ఫెల్ప్స్‌ వారసుడిగా పేరు సంపాదించి.. సంచలనాలు సృష్టించేందుకు టోక్యోలో అడుగుపెట్టిన అమెరికా స్విమ్మర్‌ డ్రెసెల్‌ అంచనాలను అందుకుంటూ అదరగొడుతున్నాడు. కొలనులో అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్‌ తొలి వ్యక్తిగత పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. రిలేతో కలిపి ఇప్పటికే ఈ విశ్వ క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచిన అతను.. మరిన్ని పతకాలు సొంతం చేసుకునే దిశగా సాగుతున్నాడు.

టోక్యో: ఈతలో 24 ఏళ్ల డ్రెసెల్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే 4×100మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో దేశానికి బంగారు పతకం అందించడంలో కీలక పాత్ర పోషించిన అతను.. ఇప్పుడు తన తొలి వ్యక్తిగత ఒలింపిక్స్‌ స్వర్ణాన్ని ముద్దాడాడు. గురువారం పురుషుల 100మీ. ఫ్రీస్టైల్‌లో అతను ఛాంపియన్‌గా నిలిచాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కైల్‌ చాల్మర్స్‌ (ఆస్ట్రేలియా)ను వెనక్కినెట్టి ఒలింపిక్స్‌ రికార్డుతో పసిడి పట్టేశాడు. ఫైనల్లో 47.02 సెకన్లతో రేసు ముగించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. చాల్మర్స్‌ (47.08సె), రష్యా ఒలింపిక్‌ కమిటీ స్విమ్మర్‌ కోలెస్కినోవ్‌ (47.44) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. ఈ పసిడికి ముందు వరకూ డ్రెసెల్‌ సాధించిన స్వర్ణాలన్నీ రిలేలోనే వచ్చాయి.

అనూహ్యంగా..: ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన పురుషుల 800మీ. ఫ్రీస్టైల్‌ ఈతలో 21 ఏళ్ల అమెరికా స్విమ్మర్‌ బాబీ ఫింక్‌ పసిడి సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో 7 నిమిషాల 41.87 సెకన్ల టైమింగ్‌తో అతను అగ్రస్థానంలో నిలిచాడు. గ్రెగోరియో (ఇటలీ- 7:42.11సె), రోమాంచుక్‌ (ఉక్రెయిన్‌- 7:42.33సె) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

చైనాకు తొలి స్వర్ణం: మరోవైపు మహిళల 200మీ. బటర్‌ఫ్లైలో ఛాంపియన్‌గా నిలిచిన యూఫీ.. టోక్యో స్విమ్మింగ్‌లో చైనాకు తొలి స్వర్ణాన్ని అందించింది. 2 నిమిషాల 3.86 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె ఒలింపిక్స్‌ రికార్డు నమోదు చేసింది. అమెరికా స్విమ్మర్లు రేగన్‌ (2:05.30సె), ఫ్లికింగర్‌ (2:05.65సె) వరుసగా వెండి, కంచు పతకాలు గెలిచారు. మహిళల 4×200మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అమెరికాకు చుక్కెదురైంది. ప్రపంచ రికార్డుతో చైనా బంగారు పతకం నెగ్గింది. ఫైనల్లో ఆ దేశ స్విమ్మర్లు 7 నిమిషాల 40.33 సెకన్లలో రేసు ముగించి సంచలనం సృష్టించారు. అమెరికా (7:40.73), ఆస్ట్రేలియా (7:41.29) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని