వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలి
close
Updated : 17/05/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలి

అమరావతి: వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చే బాధ్యత రాష్ట్రాలు తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక  వలస కూలీలు స్వస్థలాలకు వెళుతూ మార్గమధ్యలోనే చనిపోవడం బాధాకరమన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన రోడ్డుప్రమాదాలను ఉదహరించారు.

‘ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తేనే వలస కూలీల వెతలు తీరుతాయి. వలస కూలీలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పనులు కోసం వచ్చారు.. మన రాష్ట్ర పౌరులు కాదులే అనే విధంగా వ్యవహరించడం సరికాదు. బాధ్యత తీసుకోకుండా ఉంటే సమస్య పరిష్కారం కాదు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల చెమట చుక్కల భాగస్వామ్యం ఉంది అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో ఛత్తీస్‌గడ్‌, ఒడిశా, అసోం రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ గనుల్లో ఒడిశా కూలీలు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి ప్రాంతంలో పరిశ్రమలు, నిర్మాణ పనుల్లో వలస కూలీలున్నారు. ఇక్కడి ప్రాజెక్టులు, పరిశ్రమలు నడిచేందుకు ఇతర రాష్ట్రాల కూలీల భాగస్వామ్యం ఉంది.  తమ దగ్గర ఉన్న వలస కార్మికులు, వారి కుటుంబాలను కష్టకాలంలో స్వస్థలాలకు చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధిగా భావించాలి.

కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కార్మిక కుటుంబాలను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజా రవాణా వ్యవస్థ బస్సులను వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు ఉపయోగించాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సరిహద్దు దగ్గర వదిలిపెడతాం అనడం బరువు వదిలించుకొన్నట్లు అవుతుంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద కొత్త సమస్యలు వస్తాయి. తమిళనాడు నుంచి తిరిగివస్తున్న ఏపీకి చెందిన కార్మికులను తడ వద్ద నిలిపివేయడం మంచిది కాదు. ఇతర రాష్ట్రాల వారిని ఆధార్‌ కార్డు చూసి వదులుతున్నారు. మన రాష్ట్రం వారిని విడిచిపెట్టడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి అనుమతులు ఇవ్వాలి. వారికి వైద్య పరీక్షలు చేయించాలి’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని