Israel: ఇజ్రాయెల్‌ ఆధీనంలో రఫా క్రాసింగ్‌

Rafah crossing: రఫాపై దాడి కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌.. ఇక్కడి సరిహద్దు క్రాసింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది.

Published : 07 May 2024 12:32 IST

జెరూసలెం: గాజా (Gaza)లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్‌ (Hamas) అంగీకారం తెలిపినప్పటికీ.. ఇజ్రాయెల్‌ (Israel) తమ రఫా ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఈ పట్టణంలోకి యుద్ధ ట్యాంక్‌లతో అడుగుపెట్టిన ఐడీఎఫ్‌ దళాలు.. తాజాగా గాజా వైపున ఉన్న రఫా సరిహద్దు క్రాసింగ్‌ (Rafah crossing)ను ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది.

సోమవారం రాత్రి నుంచి తూర్పు రఫాలోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ లక్షిత దాడులు ప్రారంభించింది. ఇందులో 20 మంది హమాస్‌ మిలిటెంట్లు మరణించినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో మూడు సొరంగ ప్రాంతాలను కూడా గుర్తించినట్లు పేర్కొంది. అర్ధరాత్రి దాటి తర్వాత గాజా వైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను నియంత్రణలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఐడీఎఫ్‌ ట్యాంకులు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ క్రాసింగ్‌ వద్ద ఇజ్రాయెల్‌ జెండా ఎగురుతున్న దృశ్యాలు మీడియాలో కన్పించాయి. అయితే, దీనిపై స్పందించేందుకు ఐడీఎఫ్‌ నిరాకరించింది. ప్రస్తుతం ఈ క్రాసింగ్‌ వద్ద సేవలన్నీ నిలిచిపోయాయని పాలస్తీనా క్రాసింగ్స్‌ అథారిటీ ప్రతినిధి వేల్‌ అబు ఒమర్‌ తెలిపారు. నిరంతరం బాంబులు పడుతున్నాయని, దీంతో సిబ్బంది ఇక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈ రఫా క్రాసింగ్‌.. గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో ఉంటుంది. గతేడాది గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెట్టిన నేపథ్యంలో ఈజిప్టు దీన్ని మూసివేసింది. అనంతరం అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనలతో మానవతా సాయం అందించడం కోసం దీన్ని తెరిచారు. అప్పటి నుంచి ఈ క్రాసింగ్‌ ద్వారా గాజాలో చిక్కుకున్నవారి మానవతా సాయాన్ని పంపించారు. అనేక మంది పాలస్తీనా వాసులు, ఇతర విదేశీయులు కూడా ఈ మార్గం నుంచి గాజాను వీడారు.

ఇదిలా ఉండగా.. గాజాలో 40 రోజుల కాల్పుల విరమణ.. 33 మంది బందీల విడుదల.. ప్రతిగా భారీస్థాయిలో పాలస్తీనా ఖైదీల విడుదల ప్రతిపాదనకు హమాస్‌ సోమవారం అంగీకరించింది. అయితే, ఈ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫాపై దాడి కొనసాగిస్తామని టెల్‌ అవీవ్‌ ఉద్ఘాటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని